Kanchanjungha Express Accident: బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ని గూడ్స్ ట్రైన్ ఢీకొట్టిన ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం...మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. 5 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. రెండు రైళ్లూ ఒకే ట్రాక్‌పై ఎలా వచ్చాయన్న దానిపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఓ ట్రాక్‌పై అప్పటికే కాంచనజంగ ఎక్స్‌ప్రెస్ (Kanchanjungha Express) ఉండగా వెనక నుంచి వచ్చి గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. అంటే...ఎక్కడో మిస్‌కమ్యూనికేషన్ జరిగి ఉంటుందన్నది ప్రాథమిక అంచనా.
అయితే..దీనిపై అధికారులు విచారణ మొదలు పెట్టారు ప్రాథమికంగా ప్రమాదానికి కారణమేంటో వెల్లడించారు. డార్జిలింగ్ వద్ద గూడ్స్ ట్రైన్‌కి రెడ్ సిగ్నల్ పడింది. కానీ లోకోపైలట్ దాన్ని గమనించకుండా వెళ్లిపోయాడు. అప్పటికే ఆ ట్రాక్‌పై కాంచనజంగ ఎక్స్‌ప్రెస్ ఉంది. ఫలితంగా రెండు రైళ్లూ ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి. సిగ్నల్ జంప్ చేసి గూడ్స్ నేరుగా ఆ ఎక్స్‌ప్రెస్‌ని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ధాటికి ఒక్కసారిగా బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఎక్స్‌ప్రెస్ బోగీలు అదుపు తప్పాయి. ఒకదానిపై ఒకటి ఎక్కాయి. అయితే..ఇది ప్రాథమికంగా అధికారులు చెబుతున్న విషయం. దీనిపై ఇంకా పూర్తి స్థాయి విచారణ జరగాల్సి ఉంది.