How To Become A Crorepati With SIP: కోటీశ్వరుడు కావాలాని ఎవరు కోరుకోరు చెప్పండి. దీనికంటే ముందు, కోటీశ్వరుడు ఎలా అవ్వాలి అనే ప్రశ్న వేసుకోవాలి. దీనికి సమాధానం... "సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌" లేదా "SIP". స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు మ్యూచువల్ ఫండ్స్‌ (Investment in Mutual Funds) ఒక మంచి మార్గం. మార్కెట్ పరిజ్ఞానం పెద్దగా లేకపోయినా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. వీటిని చురుగ్గా పర్యవేక్షించాల్సిన అవసరం లేదు, పెట్టుబడిదార్ల బదులు ఫండ్‌ మేనేజర్‌ ఆ పని చూసుకుంటాడు. 


మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టొచ్చు లేదా నిర్ణీత కాల వ్యవధుల్లో (నెలనెలా, మూడు నెలలకు ఒకసారి లేదా మరేదైనా కాల వ్యవధి) మదుపు చేసుకుంటూ వెళ్లొచ్చు. సాధారణంగా, రూ.500 నుంచి SIP స్టార్ట్‌ చేయవచ్చు. రూ.100 ప్లాన్స్‌ కూడా కొన్ని ఉన్నాయి.


సిప్‌ ద్వారా కోటి రూపాయలు సంపాదించడం ఎలా?


కోటి రూపాయల సంపద సృష్టించాలన్న మీ లక్ష్యాన్ని చేరుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే.. మీ నెలవారీ పెట్టుబడి మొత్తం +  మీ వద్ద ఉన్న సమయం + ఆశిస్తున్న రాబడిపై అది ఆధారపడి ఉంటుంది. మీరు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో SIP స్టార్ట్‌ చేశారనుకుందాం. దాన్నుంచి 12% వార్షిక రాబడి వస్తుందని అంచనా వేద్దాం. ఇప్పుడు, మీ జీతం రూ. 25,000 నుంచి ప్రతి నెలా క్రమం తప్పకుండా 4,000 రూపాయలను స్థిరంగా పెట్టుబడి పెట్టాలి. దీనివల్ల, మీరు 28 ఏళ్లలో లేదా 339 నెలల్లో 1 కోటి రూపాయలను కూడబెట్టుగలుగుతారు. నెలకు రూ. 10,000 లేదా మీ రూ.25,000 జీతంలో 40% పెట్టుబడి పెడితే... కేవలం 20 ఏళ్లలో లేదా 248 నెలల్లో రూ. 1 కోటి జమ చేయవచ్చు.


స్టెప్-అప్ SIP ద్వారా లక్ష్యాన్ని చేరడం ఇంకా ఈజీ


మీ జీతం ఎప్పటికీ రూ.25,000గానే ఉండదు. ఏటా పెరుగుతుంది. ఇలా, జీతం పెరిగిన ప్రతిసారి SIP టాప్-అప్ (స్టెప్-అప్ SIP) ఫీచర్‌ను ఉపయోగించాలి. అంటే, ఏటా పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లాలి. ఒక ఉదాహరణతో దీనిని చూద్దాం. రూ. 25,000 జీతంలో నెలకు రూ. 10,000 SIP చేస్తున్నారనుకుందాం. ఈ మొత్తాన్ని ఏటా కచ్చితంగా 5% చొప్పున పెంచుతూ వెళ్లండి. దీనివల్ల సుమారు 18.3 సంవత్సరాలు లేదా 220 నెలల్లో కోటి రూపాయలను సృష్టించొచ్చు. మీరు మరింత దూకుడుగా నిర్ణయం తీసుకుని, ప్రతి సంవత్సరం మీ SIP సహకారాన్ని (Contribution) 10% చొప్పున పెంచుకుంటే, కేవలం 16 సంవత్సరాలు లేదా 194 నెలల్లో రూ. 1 కోటి మైలురాయిని చేరుకోవచ్చు.


16% రిటర్న్‌తో దాదాపు రూ.7 కోట్లు


ప్రతి నెలా రూ. 10,000 పెట్టుబడి పెడుతూ, మీ పెట్టుబడిపై 16% రాబడి వస్తుందని అంచనా వేస్తే, 30 ఏళ్ల తర్వాత మీకు రూ. 6.80 కోట్ల కార్పస్‌ కనిపిస్తుంది. చక్రవడ్డీకున్న శక్తి ఇది. 


స్టెప్-అప్ SIP ఫీచర్‌ను ఉపయోగిస్తే దాదాపు రూ.15 కోట్లు 


ప్రతి నెలా రూ. 10,000 పెట్టుబడి పెడుతూ, ఏటా SIP కాంట్రిబ్యూషన్‌ 10% చొప్పున పెంచినట్లయితే, 16% రాబడి రేటుతో మీ సంపద రూ. 14.70 కోట్లకు చేరుతుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మారని స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి