Kanchanjungha Express Accident: పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు (Kanchanjungha Express) ప్రమాదం సంభవించింది. గూడ్స్ రైలు కాంచన జంగ ఎక్స్ ప్రెస్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారని ప్రాథమికంగా అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. డార్జిలింగ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అసోంలోని సిల్చార్ నుంచి వస్తున్న కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ని రంగపాని స్టేషన్ వద్ద గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడం వల్ల బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కాయి. ఈ ప్రమాదంలో కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌కి చెందిన రెండు కోచ్‌లు అదుపు తప్పాయి. ఈ ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రమాద ధాటికి బోగీలు చెల్లాచెదురయ్యాయి. అయితే...ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారని, పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. రెడ్ సిగ్నల్ పడినా పట్టించుకోకుండా వెళ్లిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అధికారులు చెబుతున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని తెలిపారు. రైల్వేతో పాటు NDRF,SDRF బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్పెషల్ హెల్ప్‌డెస్క్‌లు..
ఘటనా స్థలం వద్ద ఎమర్జెన్సీ మెడికల్ టీమ్ అందుబాటులోకి వచ్చింది. వేగంగా బాధితులను హాస్పిటల్‌కి తరలిస్తోంది. మార్గ మధ్యలోనే అవసరమైన చికిత్స అందిస్తోంది. ఇక రైల్వే అధికారులు ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. సాయం కావాల్సిన వాళ్లు హెల్ప్‌లైన్ నంబర్‌లకు కాల్ చేయాలని వెల్లడించారు. నైహతి స్టేషన్ వద్ద మరో స్పెషల్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.
Also Read: Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాదానికి కారణమిదే, అధికారులు ఏం చెబుతున్నారంటే?