Revanth Reddy : ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేయాలని భావిస్తున్న తెలంగాణ సర్కారు ఆ దిశగా తీవ్ర కసరత్తు చేస్తోంది. 2 లక్షల రుణమాఫీ కోసం విధివిధానాలు ఖరారు చేస్తూనే నిధుల వేట ముమ్మరం చేసింది. అందుబాటులో ఉన్న అన్ని అంశాలను పరిశీలించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు రకరకాల ప్రతిపాదనలు సిద్ధం చేస్తన్నారు. రుణమాఫీ నిజంగా అర్హులైన వారికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు రైతు బంధు ఇచ్చినట్టు అన్న వర్గాలు రుణమాఫీ చేయొద్దనే ఆలోచన ఉంది. అందుకే అర్హులను గుర్తించేందుకు చేపట్టాల్సిన వడపోత ప్రక్రియను ఖరారు చేయనుంది. 


పంట రుణమాఫీ అంశంపై ఈ వారంలోనే కీలకమైన మంత్రివర్గం సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భేటీలో రుణమాఫీ అర్హతకు సంబంధించిన విధివిధానాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆలోచనతో ఉంది. ఆ దిశగా ప్రయత్నిస్తున్న అధికారులు అర్హుల జాబితాలో పాస్‌బుక్‌, రేషన్ కార్డును పరిశీలిస్తున్నారు. ఇవి ఉన్న వాళ్లనే పరిగణలోకి తీసుకొని రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని యోచిస్తున్నారట. గతంలో రైతు బంధు ఉచ్చినట్టు ప్రజాప్రతినిధులు, ఐటీ చెల్లించే ఉద్యోగులకు రుణమాఫీ నుంచి తప్పించాలని చూస్తున్నారు. 


ఇప్పటికే అధికారులు బ్యాంకర్లతో మాట్లాడి రెండు లక్షల రూపాయల రుణం తీసుకున్న వారి జాబితాను తెప్పించుకున్నారు. మొత్తం ఎంత మంది ఉన్నారు. రుణమాఫీ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందనే అంచనాల్లో బిజీగా ఉన్నారు. రెండు మూడు రోజుల్లోనే ఈ ప్రక్రియ కొలిక్కిరానుంది. అనంతరం ఆ జాబితాను ముందు ఉంచుకొని అసలు లబ్ధిదారుల జాబితను సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే రైతు బంధు పొందుతున్న వారిలో ఆరు లక్షల మందికి పట్టాదారు పాస్‌పుస్తకాలు లేవు. అలాంటి వారిని తప్పిస్తే రుణగ్రస్తుల సంఖ్య భారీగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు రేషన్ కార్డును కూడా నిబంధనల్లో పడితే ఈ సంఖ్య చాలా వరకు తగ్గుతుందని అంటున్నారు. ఐటీ చెల్లించే వాళ్లు, ప్రజాప్రతినిధులను తప్పిస్తే కూడా రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 40 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా నిజంగా అవసరం ఉన్న వాళ్లకే రుణమాఫీ చేయాలని అలాంటి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. 


మరోవైపు చేస్తున్న రుణమాఫీ దశల వారీగా చేస్తారనే టాక్ నడుస్తోంది. ఆగస్టు 15 ప్రారంభించే రుణాఫీ ప్రక్రియలో మొదటి దశలో 50 వేలు, రెండో దశలో 75 వేలు, మూడో దశలో లక్ష తర్వాత రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణలోని దాదాపు 70 శాతం రైతులకు లక్ష లోపే రుణం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా వీళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని తర్వాత మిగతా వారికి రుణమాఫీ చేయాలని చూస్తున్నారు. 


నిధుల సమీకరణే పెద్ద టాస్క్ 


ఆగస్టులో రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం అక్కడకు నెలరోజుల్లో రైతు భరోసా నిధులు విడుదల చేయాలి. వాటితోపటు రైతు బీమా, పంటల బీమాను కూడా చెల్లించాలి. దీంతో ఈ నాలుగు పథకాల కోసం 50 వేల కోట్లు సమీకరించాలి. ఇది ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఆలోచిస్తున్న రూల్స్ ప్రకారం రుణమాఫీ కోసం 35వేల కోట్లు, రైతు భరోసారుక పదివేల కోట్లకుపైగా బీమా పథకాల కోసం నాలుగు వేల కోట్లు అవసరం అవుతాయి. 


నాలుగు పథకాల కోసం నిధులు సమీకరణ ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారుతోంది. వివిధ రాష్ట్రాల్లో, కేంద్రం పెట్టిన రూల్స్ ప్రకారం లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవడం ఒక మార్గమైతే... రైతుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకోవడం మరో మార్గం. వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములు తాకట్టుపెట్టి రుణాలు తెచ్చుకోవడంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచరం.