Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద నిర్ణయాలతో పాటు కాంట్రవర్సీ కామెంట్స్‌తో టాప్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఆమె చేసే వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి. దేశంలోని రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండే మమతా.. బీజేపీతో పాటు మోదీ టార్గెట్‌గా ఎప్పుడూ విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన ఆరోపణలు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.
రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమిలోని నేతలను అరెస్ట్ చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేతలందరినీ అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపణలు చేశారు. విపక్ష నేతలందరినీ అరెస్ట్ చేసి వాళ్లేకు వాళ్లే ఓట్లు వేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కోల్‌కతాలో జరిగిన ఓ సమావేశంలో మమతా బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోన్నాయి. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే అనేక మంది నేతలకు ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రతిపక్ష, విపక్ష నేతలను లోక్‌సభ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పుడు మమతా కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
అలాగే ప్రతిపక్ష పార్టీ ఎంపీల ఫోన్లు హ్యాకింగ్‌కు గురవుతున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్ష పార్టీల నేతలను అణచివేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, తద్వారా ఖాళీ దేశంలో వాళ్లకు వాళ్లే ఓట్లు వేసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారని దీదీ ఆరోపించారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి ఉపాధి హామీ పథకం కింద వచ్చే నిధులను విడుదల చేయాలని మమతా డిమాండ్ చేశారు. పెండింగ్ నిధులను నవంబర్ 16లోపు విడుదల చేయాలని గతంలో దీదీ డెడ్ లైన్ విధించారు. అప్పటివరకు విడుదల చేయకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. తొలుత నవంబర్ 1 వరకు డెడ్ లైన్ విధించగా.. గవర్నర్ హామీ మేరకు నవంబర్ 16 వరకు వేచి చూస్తామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
అయితే ఇండియా కూటమి నేతలను అరెస్ట్ చేయనున్నారని ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. అందులో భాగంగా తొలుత కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయనున్నారని తెలిపింది. నవంబర్ 2న కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారని ఆప్ చెబుతోంది. నవంబర్ 2న ఈడీ ముందు హాజరుకావాలని కేజ్రీవాల్‌కు నోటీసులు అందాయి. దీంతో రేపే అరెస్ట్ చేస్తారని ఆప్ ఆరోపిస్తోంది. ఇండియా కూటమి ఏర్పాటుతో బీజేపీలో భయం మొదలైందని, కూటమిలో కీలక నేతలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపిస్తోంది. కేజ్రీవాల్ తర్వాత ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ సీఎం తేజస్వి యాదవ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడులో సీఎం స్టాలిన్, మహారాష్ట్ర నుంచి శివసేన, ఎన్‌సీపీ నేతలను అరెస్ట్ చేయనుందని స్ఫష్టం చేసింది.