Weather Update India:



ఆ రాష్ట్రాల్లో ఉక్కపోత..


దేశవ్యాప్తంగా మరో 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. 2-4 డిగ్రీల మేర టెంపరేచర్ పెరగనుందని తెలిపింది. కొన్ని చోట్ల తుపానులతో పాటు బలమైన గాలులు వీచే అవకాశముందని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్,ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో రానున్న రెండ్రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. రెండ్రోజుల తరవాత అక్కడి వాతావరణ పరిస్థితులు కుదుటపడతాయని వెల్లడించింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో పలు చోట్ల సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే ప్రకటించింది IMD.


"మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో రానున్న రెండ్రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. ఆ తరవాత బలమైన గాలులు కాస్త తగ్గుముఖం పడతాయి"
- IMD


వాతావరణ మార్పులు..


బిహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హరియాణాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నట్టు IMD అంచనా వేసింది. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉన్నట్టుండి వేడి పెరిగిపోవడం, ఆ తరవాత వాతావరణం చల్లబడం, వర్షాలు కురవడం..ఇలా ఒకేరోజు ఎన్నో మార్పులు చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా నగరాల్లో ఈ మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 1901 తరవాత అత్యధికంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే కొన్ని చోట్ల వానలు కురవడం వల్ల కాస్త ఊరట లభించింది. ఈ అకాల వర్షాలతో పంట నష్టం భారీగా జరిగింది. ఉత్తర ప్రదేశ్, హరియాణా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో రైతులు నష్టపోయారు. 


రికార్డులు బద్దలే..


దేశవ్యాప్తంగా చాలా చోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువే నమోదవుతాయని వెల్లడించింది IMD. మధ్య, తూర్పు, వాయువ్య భారత్‌లోని ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. కనీసం 10 రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఏప్రిల్‌లో బిహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలపై ప్రభావం ఉండే అవకాశాలున్నాయి. వీటితో పాటు మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్,హరియాణాలోని ప్రజలకూ ఈ బాధలు తప్పవని IMD స్పష్టం చేసింది. సాధారణంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటితే "Heat Wave"గా ప్రకటిస్తారు. 1901 తరవాత ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు పెరిగాయని తెలిపింది IMD.ఆ తరవాత అనూహ్యంగా వర్షాలు కురవడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గు ముఖం పట్టాయి. మార్చి నెలాఖరు నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. గతేడాది మార్చి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 121 ఏళ్ల రికార్డునీ అధిగమించాయి. గతేడాది ఏప్రిల్ కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా రికార్డుకెక్కింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు కొన్ని చోట్ల వర్షాలూ కురిసే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. 


Also Read: చెన్నై ఎయిర్‌పోర్ట్ టర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని,వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కీ పచ్చజెండా