Weather Latest News: ఉపరితల ఆవర్తనం ఒకటి మరఠ్వాద, దాని పరిసర ప్రాంతంలో 0.9 కి. మీ ఎత్తులో ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నిన్న  దక్షిణ తెలంగాణ నుండి  దక్షిణ తమిళ నాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు  మరఠ్వాడ నుండి దక్షిణ తమినాడు వరకు అంతర్గత కర్ణాటక మీదుగా  సగటు సముద్ర  మట్టానికి 0.9 కి మి ఎత్తులో వ్యాపించి ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి  తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు రాష్ట్రంలో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఈ జిల్లా్ల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. 


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి చినుకులు కురిసే అవకాశం ఉంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో దక్షిణ, నైరుతి దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా నమోదైంది. 79 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


Andhra Pradesh Weather: దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఉన్న ద్రోణి ఇప్పుడు మరఠ్వాడ, పొరుగు ప్రాంతం మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో పైన గల ఉపరితల ఆవర్తనం నుంచి కొనసాగుతుంది. మరో ద్రోణి మరఠ్వాడా, పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం నుంచి విదర్భ, దక్షిణ ఛత్తీస్ గఢ్ మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకూ సగటు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో దక్షిణ ఛత్తీస్ గఢ్, పరిసరాల్లో గల ఉపరితల ఆవర్తనం ఇప్పుడు బలహీనపడింది. దక్షిణ తెలంగాణ, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 1.5 కిలో మీటర్ల వరకూ విస్తరించిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. దక్షిణ కోస్తాంధ్ర ప్రదేశ్ లోనూ తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని.. వేడి, తేమ వాతావరణం ఒకటి లేక రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.