How Many Seats Will Janasena Get In Uttarandhra In The Second Phase : రానున్న సార్వత్రిక ఎన్నికలకు కూటమిగా బరిలో దిగుతున్న తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితాను శనివారం (ఫిబ్రవరి 24న) ఉదయం విడుదల చేశారు. ఈ జాబితాలో తెలుగుదేశం పార్టీ నుంచి 94 మంది, జనసేన పార్టీలో ఐదుగురు పేర్లు ఉన్నాయి. మొత్తంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలు పొత్తులో భాగంగా ఇస్తున్నట్టు స్పష్టత వచ్చింది.
తొలి జాబితాలో ప్రకటించిన ఐదు స్థానాల్లో ఉత్తరాంధ్రకు సంబంధించి రెండే సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం ఒకటి కాగా, అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి అసెంబ్లీ స్థానం మరొకటి ఉంది. ఈ నేపథ్యంలో రెండో విడతలో ప్రకటించబోయే స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మిగిలిన 19 సీట్లలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎన్ని సీట్లు ఉంటాయన్న ఉత్సుకత సర్వత్రా నెలకొంది. ఈ ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన నుంచి సీట్లు ఆశిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది. వీరికి సీట్లు దక్కుతాయా..? లేదా..? అన్న చర్చ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది.
ఈ నేతలకు సీట్లు దక్కేనా..?
టీడీపీ, జనసేన కూటమి రెండో జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఐదు సీట్లకు మాత్రమే జనసేన అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 19 సీట్లకు అభ్యర్థులను ఎవరిని ప్రకటిస్తారన్న ఆసక్తి ఇప్పుడు జనసేన కేడర్‌తోపాటు నాయకుల్లో నెలకొంది. ఇప్పటికే పలువురు ఆశావహులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ జాబితా విశాఖ జిల్లాలో ఎక్కువగా ఉంది. కొద్దిరోజులు కిందట జనసేన పార్టీలో చేరి నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్న వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఆ పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ, వైసీపీ నగర అధ్యక్షుడిగా పని చేసి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, సీనియర్ నేతలు సుందరపు విజయ్ కుమార్, సుందరపు సతీష్ కుమార్ తదితర నేతలు ఉన్నారు. వీరంతా రెండో జాబితా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఎంపీ బరిలో నాగబాబు..?
అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి మెగా బ్రదర్ నాగబాబు బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు కేటాయించారు. ఇక్కడ అత్యధికంగా ఉండే కాపు, గవర ఓటర్లను బ్యాలెన్స్ చేసే ఉద్ధేశంతో అసెంబ్లీ స్థానాన్ని కొణతాలకు కేటాయించారు. పార్లమెంట్ స్థానాన్ని కాపు సామాజికవర్గానికి చెందిన నాగబాబు కేటాయించడం ద్వారా ఇరు వర్గాలకు చేరువ కావాలని జనసేన భావిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరిగిందని చెబుతున్నారు. ఇప్పటికే నాగబాబు పోటీ చేసేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్థానికంగా నివాసం ఉండేందుకు అనుగుణంగా ఇంటిని కూడా సిద్ధం చేసుకున్నారు. కొద్దిరోజుల్లోనే నాగబాబు ఇక్కడకు పూర్తిగా మకాం మార్చనున్నారని ప్రచారం జరుగుతోంది.