These Seats Are Only For The 98 Percent Strike Rate Says Pawan : రానున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ, జనసేన (Janasena Party) కూటమి అభ్యర్థుల మొదటి జాబితాను ఇరు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు (Chandrababu), పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సీట్ల ప్రకటన అనంతరం క్యాడర్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. పొత్తులో భాగంగా 24 సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్నట్టు అనుకోవద్దని జనసైనికులకు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సూచించారు. 98 శాతం స్ట్రైక్ రేట్ కోసమే ఈ సీట్లు తీసుకున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. పోటీ చేసిన ప్రతీ చోటా జనసేనను గెలిపించుకోవాలని, అందుకు అనుగుణంగా కృషి చేయాలని జనసేనాని పిలుపునిచ్చారు. మూడు పార్లమెంటు సీట్లతో కలుపుకుంటే మొత్తంగా 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టేనని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గడిచిన ఎన్నికల్లో పది సీట్లు గెలుచుకుని ఉన్నా.. ఇప్పుడు ఎక్కువ అడిగే వాళ్లమని జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 


మెజార్టీ స్థానాల్లో పోటీ చేయాలంటూ పెద్దల నుంచి సూచన


రానున్న ఎన్నికల్లో జనసేన 40 - 50 చోట్ల పోటీ చేయాల్సిందేనని చెప్పారని, మూడు ఎంపీ స్థానాలను కలిపితే 40 స్థానాల్లో పోటీ చేసినట్లు అవుతోందన్నారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనే ఆలోచనను పక్కన పెట్టి, పోటీ చేసిన ప్రతిచోటా జనసేనను గెలిపించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తీసుకున్న చెట్ల సంఖ్య కంటే గెలుపు శాతం అధికంగా ఉండేలా చూడాలని ఈ సందర్భంగా పవన్ కోరారు. ఇకపోతే, జనసేనానితోపాటు నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది.


బీజేపీ కోసం సీట్లు తగ్గించుకున్నామన్న పవన్


సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్దం అని అంటున్నారని, తాము కూడా యుద్దానికి సంసిద్ధమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే తాము ఇదంతా చేస్తున్నట్లు వివరించారు. బీజేపీకి సీట్లు ఇచ్చే క్రమంలో తాము సీట్లు తగ్గించుకుంటున్నామని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనికి అందరూ కట్టుబడి ఉండాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తోందని పవన్ కళ్యాణ్ మరో మారు స్పష్టం చేశారు.