Temple Tax Bill in Karnataka: రూ. కోటి కన్నా ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాల నుంచి ఏటా 10% ట్యాక్స్ వసూలు చేస్తామంటూ కర్ణాటక ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. హిందూవ్యతిరేక ప్రభుత్వం అంటూ బీజేపీ మండి పడింది. అయితే...ఈ విషయంలో చాలా పట్టుదలతో ప్రభుత్వం అసెంబ్లీలో ఈ బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదం తెలిపేలా చేసుకుంది. శాసనమండలిలో మాత్రం సిద్దరామయ్య సర్కార్‌కి షాక్ తగిలింది. మండలిలో ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించారు. అధికార కాంగ్రెస్ కన్నా శాసనమండలిలో బీజేపీకే ఎక్కువ మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌కి 30 మంది MLCలు ఉండగా..బీజేపీకి 35 మంది ఉన్నారు. జేడీఎస్ నుంచి 8 మంది ఎమ్‌ఎల్‌సీలు ఉన్నారు. బీజేపీ MLCలు ఈ బిల్‌ని వ్యతిరేకించారు. ప్రభుత్వం Karnataka Hindu Religious Institutions and Charitable Endowment Amendment Bill 2024 పేరిట ఈ బిల్‌ తీసుకొచ్చింది. రూ.కోటి కన్నా ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాల నుంచి 10% పన్ను, రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకూ ఆదాయం ఉంటే 5% మేర ట్యాక్స్ వసూలు చేస్తామని వెల్లడించింది. ఈ బిల్లులో సవరణలు చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ కొందరు మంత్రులు మాత్రం ఈ బిల్‌ని సమర్థించారు. బీజేపీ అనవసరంగా గొడవ చేస్తోందని మండి పడుతున్నారు. తాము హిందువులకు వ్యతిరేకం కాదని తేల్చి చెబుతున్నారు. 2011లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే ఈ బిల్లులో సవరణలు చేశారని రవాణా మంత్రి రామలింగా రెడ్డి ఆరోపించారు. 


"మేం హిందువులకు వ్యతిరేకం కాదు. ఆ మాటకు వస్తే బీజేపీయే హిందూ వ్యతిరేకి. 2003 నుంచే ఈ చట్టం అమల్లో ఉంది. 2011లో బీజేపీ కొన్ని సవరణలు చేసింది. ఆ సమయానికి 34 వేల ఆలయాల్లో రూ.5 లక్షల ఆదాయం వస్తోంది. ధార్మిక పరిషత్‌కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రూ.5-10 లక్షల ఆదాయం ఉన్న ఆలయాలు 193 వరకూ ఉన్నాయి. రూ.10 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవి 205 ఆలయాలున్నాయి. ఆ ఆలయాలు 10% ట్యాక్స్ కట్టాలని 2011లోనే బీజేపీ సవరణలు చేసింది. ఇప్పుడు హిందూవ్యతిరేకి ఎవరో అర్థమవుతుందిగా"


- రామలింగా రెడ్డి, కర్ణాటక రవాణా మంత్రి


ప్రభుత్వం ఏమంటోంది..?


ఈ బిల్లు కేవలం ఆలయాలకు మేలు చేసేదే తప్ప ఎలాంటి నష్టం చేయదని స్పష్టం చేస్తున్నారు కర్ణాటక మంత్రులు. చిన్న ఆలయాలకు మంచి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తేల్చి చెబుతున్నారు. అయితే..బీజేపీ మాత్రం కేవలం ఆలయాలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నిస్తోంది. మిగతా మతాల ప్రార్థనా మందిరాలకు వచ్చే ఆదాయాలకూ ఇదే నిబంధన పెట్టొచ్చు కదా అని అడుగుతోంది. ప్రభుత్వం మాత్రం బీజేపీ వాదనను ఖండిస్తోంది. అనవసరంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు అని మండి పడుతోంది. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సిద్దరామయ్య అసహనం వ్యక్తం చేస్తున్నారు. మత కల్లోలాలు సృష్టిస్తారా అంటూ మండి పడుతున్నారు. ఇప్పటికే షాప్‌ల నేమ్ బోర్డులపై కన్నడ ఉండాలన్న నిబంధనపై పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. కొన్ని కన్నడ సంఘాలు ఇంగ్లీష్‌ ఉన్న  బోర్డులను ధ్వంసం చేయడం సంచలనమైంది. ఇలా ఒకటి తరవాత ఒక సమస్య కర్ణాటకలో అలజడి సృష్టిస్తోంది.