UP Tractor Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ చెరువులో బోల్తా పడిన ఘటనలో 15 మంది మృతి చెందారు. ట్రాక్టర్‌లో కదర్‌గంజ్‌కి బయల్దేరిన భక్తులు అనుకోకుండా ఇలా ప్రాణాలు కోల్పోయారు. కస్‌గంజ్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులున్నారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. మాఘ పూర్ణిమ సందర్భంగా గంగానదీ స్నానం కోసం అంతా బయల్దేరారు. ఉన్నట్టుండి ఇలా ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు అన్ని విధాలుగా సహకరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.