TDP Janasena : రాష్ట్ర భవిష్యత్‌ కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్నామని  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra babu) అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్‌ కోసమే ఈ నిర్ణయమని చెప్పారు. తమ పొత్తు కుదిరిన రోజే వైసీపీ కాడి వదిలేసిందన్నారు.   ఈ ఉమ్మడి ఒప్పందం ఏపీ చరిత్రలోనే ఓ చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. రాష్ట విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని చక్కదిద్ది అభివృద్ధి చేసే క్రమంలోనే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలనలో తీవ్ర విఘాతం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.


రాష్టం కోలుకోలేని స్థితికి దిగజారిందని, జరిగిన నష్టం ఒక వ్యక్తిది కాదని, అయిదు కోట్ల మంది ప్రజలకు నష్టం క‌లిగింద‌న్నారు చంద్ర‌బాబు. అయిదేళ్ల పాలనలో బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ని డెమాలిష్ చేశారని, అహంకారంతో ప్రజావేదికను కూల్చివేతతో ప్రారంభమైన విధ్వంసం అయిదేళ్లపాటు కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తప్పు అని ప్రశ్నించలేని స్థితిలో పవన్ కళ్యాన్‌పై నిర్బంధం పెంచారని, ఇప్పటం గ్రామంలో ఆందోళన నుంచి విశాఖలో రోడ్ షో వరకూ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థితిలో ప్రజలకు వైసీపీ నుంచి విముక్తి కలిగించేందుకు తమ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తున్నాయని వివరించారు.


అభ్యర్థుల ఎంపికలోనూ రాజకీయంగా తీవ్ర ఎక్సైర్ సైజ్ చేశామని, 9 ఎన్నికల అనుభవం ఉన్న తాను మంచి అభ్యర్థులను ఎంపిక చేయటంలో క్షుణ్ణంగా పరిశీలించామని చంద్రబాబు చెప్పారు. కోటి పది లక్షల మంది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించామని, ప్రజలు, కార్యకర్తల మనోస్థితిని నమ్మి , సరైన సమాచారంతో అన్ని కోణాలు విశ్లేషించి అభ్యర్థులను ఎంపిక చేశామని, టీడీపీ నుంచి 118 స్థానాల్లోనూ , జనసేన 24 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో 23 మంది కొత్త అభ్యర్థులు ఉన్నారని, యువత, మహిళలు, బీసీలకే అధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు, ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించే అభ్యర్థులనే ఎంపిక చేశామని చంద్రబాబు వివరించారు. ఇక ఎర్రచందనం స్మగ్లర్లను, రౌడీలను రంగంలోకి దించటమే కాదు, రాష్టం నలుమూలకు తరలించారని, అందుకే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, రాష్ట్రంలో భయం నెలకొందని చంద్రబాబు స్పష్టం చేశారు .   


పోటీ చేస్తున్న 94 మందిలో 23 మంది తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇందులో ఉన్నత చదువులు చదువుకున్నవారూ ఉన్నారు. అదే వైకాపా అభ్యర్థులను చూస్తే.. ఎర్ర చందనం స్మగ్లర్లను వారు పోటీకి పెట్టారు. మేం మాత్రం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే అభ్యర్థులనే  ఎంపిక చేశాం. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ఇరు పార్టీల మధ్య ఓటు బదిలీ జరగాలి. కాబట్టి పార్టీ కార్యకర్తలు ఇరు పార్టీల గెలుపునకు కృషి చేయాలి  అని పిలుపునిచ్చారు. 


గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే బరిలో నిలుపుతున్నామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే బదులు, తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్‌ కోసం ముందుకెళ్లాలని నిర్ణయించామన్నారు. 98 శాతం స్ట్రైక్‌ రేటు ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేశామని చెప్పారు. ఈ అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు ముక్తి కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 60, 70 స్థానాలు కావాలని కొందరు అంటున్నారని, గత ఎన్నికల్లో 10 స్థానాలు గెలిచి ఉంటే ఎక్కువ స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేదని చెప్పారు. 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్‌ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందన్నారు.