Assam Muslim Marriage Act: అసోం ప్రభుత్వం త్వరలోనే సంచలన ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో Assam Muslim Marriage and Divorce Registration Act 1935 చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 23న జరిగిన ఈ భేటీలో ఈ చట్టం గురించి చర్చ రాగా...దీన్ని రద్దు చేయడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పటికే Uniform Civil Code (UCC) అమలుకు సిద్ధమవుతున్న అసోం ప్రభుత్వం...అందులో భాగంగానే ముస్లిం వివాహాల చట్టాన్ని రద్దు చేయాలని భావిస్తోంది. అసోం మంత్రి జయంత మల్లా బరువా మీడియాకి ఈ విషయం వెల్లడించారు. యూసీసీ అమలులో ఇది మొదటి అడుగు అని స్పష్టం చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలో 94 మంది ముస్లిం రిజిస్ట్రార్‌లు అసోం ముస్లిం మ్యారేజ్ యాక్ట్‌ కింద వివాహాల రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, విడాకులూ ఇక్కడే జరుగుతున్నాయని తెలిపారు. 


"అసోంలో యూసీసీ అమలులో భాగంగా ఇది మొదటి అడుగు. అసోం ముస్లిం మ్యారేజ్ అండ్ డైవర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌ని తొలగించాలని కేబినెట్ నిర్ణయించుకుంది. వీలైనం త్వరలో ఈ రద్దు అమల్లోకి వస్తుంది. ఇప్పటికీ 94 మంది ముస్లిం రిజిస్ట్రార్‌లు ఇప్పటికీ ముస్లిం వివాహాల రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారు. కాలం చెల్లిన ఈ చట్టమే ఇంకా కొనసాగుతోంది. ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి చట్టం ఇది. కానీ..ఇకపై ఈ చట్టం పరిధిలో ఎలాంటి వివాహాలు, విడాకులు రిజిస్టర్ కావు. ఇకపై అన్ని వివాహాల రిజిస్ట్రేషన్‌లు Special Marriage Act 1954 ప్రకారమే జరుగుతాయి"


- జయంత మల్లా, అసోం మంత్రి






ఇప్పటికీ ఆ పాత చట్టం పరిధిలోనే వివాహాలు రిజిస్టర్ చేస్తున్న వాళ్లని జిల్లా కమిషనర్‌లు అదుపులోకి తీసుకుంటారని మంత్రి జయంత మల్లా స్పష్టం చేశారు. వాళ్లకి రూ.2 లక్షల పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేవలం బాల్య వివాహాలను అడ్డుకునేందుకే ఈ పాత చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేస్తోంది. 


యునిఫామ్ సివిల్ కోడ్ (UCC) అమలుకు అసోం ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో ఈ చట్టానికి ఆమోదం లభించింది. అయితే ఎలా అమలు చేయాలన్న అంశంపై మేధోమథనం చేస్తోంది అసోం ప్రభుత్వం. ఉత్తరాఖండ్‌ చట్టాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే కేబినెట్‌లో దీనిపై చర్చ జరిగినట్టు ఓ మంత్రి వెల్లడించారు. కానీ...అమలుపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో యూసీసీపైనే ఎక్కువగా చర్చ జరిగింది. అసోం ప్రభుత్వం ఈ చట్టం తీసుకొస్తే...ఆ పరిధిలో నుంచి గిరిజనులను తొలగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చాలా సందర్భాల్లో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ యూసీసీపై మాట్లాడారు. తమ ప్రభుత్వం కూడా కచ్చితంగా ఈ చట్టాన్ని అమలు చేస్తుందని, గిరిజనులను మాత్రం ఇందులో చేర్చమని స్పష్టం చేశారు.