Bullet Train: ``నేనెక్కవలసిన రైలు ఒక జీవిత కాలం లేటు`` అంటాడు బారిష్టర్ పార్వతీశం(Baristar Parvateesam). కానీ, మారుతున్న కాలం.. నిర్వహణలో వస్తున్న మార్పుల కారణంగా రైళ్లు(Trains) ఇప్పుడు సమయానికే వస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిత్యం కొన్ని కోట్ల మందిని గమ్య స్థానాలకు చేరుస్తున్నాయి. ఇక, భారత దేశ రైల్వేల విషయాన్ని పరిశీలిస్తే.. ప్రధాని నరేంద్ర మోడీకి ముందు.. తర్వాత.. అని చెప్పుకోక తప్పదు. అప్పటి వరకు కేవలం నిర్వహణకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వాల గురించి తెలిసిందే. కానీ, మోడీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే.. 2015లో అప్పటి వరకు ప్రత్యేకంగా ఉన్న రైల్వే బడ్జట్‌ను సాధారణ బడ్జెట్(Budget)లో విలీనం చేశారు. ఇక, ఆ తర్వాత.. నూతన రైళ్లను తీసుకురావడం.. స్వదేశీ వస్తువులకు, ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా బోగీలు, విడి వస్తువులు, పట్టాలు దేశీయంగా తయారు చేయడం ఒక పెద్ద సంస్కరణ అనే కన్నా రైల్వేల్లో విప్లవమే తీసుకువచ్చిందని అనడం ముదావహం.
వందే భారత్ నుంచి బుల్లెట్ వరకు..
దేశంలో గడిచిన 77 సంవత్సరాల్లో రైళ్లను కొత్తగా ప్రవేశ పెట్టాలంటే.. విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ, మోడీ(PM Modi) అధికారంలోకి వచ్చాక.. స్వదేశీ రైళ్లపై దృష్టి పెట్టారు. ఇలా వచ్చిందే వందే భారత్. దేశవ్యాప్తంగా ఈ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఇక నమో భారత్ రైళ్లు కూడా.. ఇప్పుడు పట్టాలెక్కాయి. ఇవన్నీ ఇలా ఉంటే.. దేశ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బుల్లెట్ రైళ్లకు కూడా మోడీ ప్రభుత్వం 2017లోనే శ్రీకారం చుట్టింది. ఇది.. ఇప్పుడు సాకారం కానుంది. భారత్ తొలి బుల్లెట్ ప్రాజెక్ట్(Bullet Train) మొదటి దశ పనులు వడివడిగా జరుగుతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav) తాజాగా ముంబయిలో టన్నెల్ పనుల్ని ప్రారంభించారు. ముంబయిలోని విక్రోలిలో పనుల పరిశీలన అనంతరం ఆయన ప్రాజెక్ట్ విశేషాలు వివరించారు. "సొరంగం దాదాపు 40 అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్నారు. దాని లోపల రైలు గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ కారిడార్ ప్రాజెక్ట్. తొలి దశ.. 2026 జులై-ఆగస్టు మధ్యలో సూరత్ - బిలిమోరా మధ్య అందుబాటులోకి వస్తుంది. ఈ రైల్వేలో షింకన్‌సేన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఇది ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన వ్యవస్థలలో ఒకటి" అని వైష్ణవ్ వెల్లడించారు.
2017లో శ్రీకారం..
ప్రపంచ దేశాల్లో బుల్లెట్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. చైనా, జపాన్ దేశాల్లో రోజురోజుకు రైల్వే వ్యవస్థ విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ బుల్లెట్‌రైళ్లు పరుగులు పెట్టాలని భావించిన ప్రధాని.. ముంబ యి - అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే(ఇప్పుడు లేరు) 2017 సెప్టెంబర్ 14న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్‌కి ముంబయి-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ అని పేరు పెట్టారు. గుజరాత్ వైపు ఈ ప్రాజెక్టు నిర్మాణం దాదాపుగా పూర్తయింది. మొత్తం రూ.1.10 లక్షల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించాలని భావించినా.. నిర్మాణ వ్యయం కరోనా కారణంగా భారీగా పెరిగిపోయింది. అదేసమయంలో దీనిని 2022 నాటికే పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ, కరోనా, ప్రభుత్వాల సహకారం వంటివి అడ్డు పడ్డాయి. అదేసమయంలో భూసేకరణలో ఆటంకాలు రాకడంతో ఆలస్యం అయ్యింది.
జపాన్ నుంచి అప్పు!
తొలి బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ వ్యయంలో 81 శాతం జపాన్ ప్రభుత్వం రుణంగా అందించింది. 0.1 శాతం వడ్డీ రేటుతో ఈ లోన్ 15 సంవత్సరాల గ్రేస్ పీరియడ్‌తో 50 సంవత్సరాలలో తిరిగి చెల్లించాలి. భారత ప్రభుత్వం హై స్పీడ్ రైలు అంటే `హెచ్‌ఎస్‌ఆర్`ను ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా 6 అదనపు కారిడార్లకు అవకాశం ఉంది. వీటిలో ఢిల్లీ -వారణాసి, ఢిల్లీ- అహ్మదాబాద్, ముంబై -నాగ్‌పూర్, ముంబై - హైదరాబాద్, చెన్నై- మైసూర్, ఢిల్లీ - అమృతసర్ ఉన్నాయి.
ఇవీ విశేషాలు..
+ తొలి బుల్లెట్ రైలు కారిడార్ పొడవు 508.17 కి.మీలు.
+ మహారాష్ట్రలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, శిల్‌ఫాటా మధ్య 21 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో భాగంగా.. 7 కిలోమీటర్ల సముద్రగర్భ రైలు సొరంగం నిర్మిస్తున్నారు.
+ గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా జరోలి గ్రామ సమీపంలో ఉన్న 350 మీటర్ల పొడవు, 12.6 మీటర్ల వ్యాసం కలిగిన మొదటి కొండ సొరంగాన్ని పూర్తి చేశారు.
+ సూరత్‌లోని ఎన్‌హెచ్ 53పై 70 మీటర్ల పొడవు, 673 మెట్రిక్ టన్నుల బరువుతో మొదటి స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు.
+ అలాంటి 28 వంతెన నిర్మాణంలో ఉన్నాయి.
+ ఈ రైలు సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. అహ్మదాబాద్ నుంచి ముంబయికి (508కిలోమీటర్లు) కేవలం 3 గంటల్లోనే చేరుకోవచ్చు.
+ 468 కిలోమీటర్ల ట్రాక్ పిల్లర్ల మీద
+ 13 కిలోమీటర్లు భూమి మీద
+ 27 కిలోమీటర్లు సొరంగ మార్గం
+ అందులో 7 కిలోమీటర్ల రైలుమార్గం సముద్రం కింద నుంచి
+ స్లేషన్లు-12
+ వేగం.... గంటకు 320 కిలోమీటర్ల నుంచి 350 కిలోమీటర్లు