Ideas of India Summit 2024: ABP నెట్‌వర్క్ నిర్వహిస్తున్న Ideas of India Summit 2024లో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల్ని అంత తేలిగ్గా తీసుకోవద్దని, రేపు ఈ ప్రతిపక్షమే ప్రభుత్వంగా మారే అవకాశముందని వెల్లడించారు. ఇంకా ఎన్నికల తేదీలు వెల్లడి కాలేదని, ప్రతిపక్షాలకు ఇంకా ఎంత సమయం ఉందో అప్పుడే చెప్పేలమని అన్నారు. మోదీ సర్కార్‌పైనా తీవ్ర విమర్శలు చేశారు. మోదీ 2.0 ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని మండి పడ్డారు. అటు నిరుద్యోగం కూడా భారీగానే పెరిగిందని అన్నారు. 


"ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించలేదు. ప్రతిపక్షాలకు ఇంకా ఎంత సమయం ఉందన్నది తెలియదు. అందుకే అప్పుడే ప్రతిపక్షాలను తక్కువ అంచనా వేయడం మానుకోండి. ఇవాళ్టి ప్రతిపక్షమే రేపటి ప్రభుత్వం కావచ్చు. అయినా మోదీ 2.0 పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలు పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణమూ పెరిగిపోయింది. నిరుద్యోగ రేటు 45.4%కి చేరుకుంది. మొత్తంగా దేశం గురించి మాట్లాడినప్పుడు గొప్పగానే అనిపిస్తుండొచ్చు. కానీ వ్యక్తిగతంగా ప్రశ్నించినప్పుడే అసలు నిజాలు బయటకు వస్తాయి. ఉద్యోగాలు ఇవ్వనప్పుడు యువత మళ్లీ మోదీకే ఓటు వేస్తారన్న గ్యారెంటీ ఏముంది."


- శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ


ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు వెనకబడుతోందో కూడా వివరించారు శశిథరూర్. ఓటర్లకు చేరువ కావడంలో బీజేపీ సక్సెస్ అవుతోందని, బహుశా ఈ విషయంలోనే కాంగ్రెస్‌ కాస్త వెనకంజలో ఉండొచ్చు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైగా ఆ పార్టీకి ఫండింగ్ కూడా భారీ ఎత్తున వస్తోందని వెల్లడించారు. కాంగ్రెస్‌ని సూడో సెక్యులర్‌ అంటూ విమర్శించడంపైనా స్పందించారు. మైనార్టీలని అణిచి వేయడం వల్ల దేశం అభివృద్ధి చెందలేదంటూ బీజేపీకి చురకలు అంటించారు. వాళ్లకు తమ దేశంలోనే చోటు లేదని తెలిసినప్పుడు మళ్లీ విధ్వంసాలు జరిగే ప్రమాదముందని అన్నారు. వాళ్ల నమ్మకాలనే వాళ్లకు బూచిగా చూపించి భయపెట్టే పద్ధతి మానుకోవాలని స్పష్టం చేశారు.