Weather Latest News: ఈ రోజు ఒక ఉపరితల ఆవర్తనం దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల వరకు విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఒక ద్రోణి పైన పేర్కొన్న ఉపరితల ఆవర్తనం నుంచి రాయలసీమ పైగా దక్షిణ తమిళ నాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి  తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది. 


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ, నైరుతి దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21.2 డిగ్రీలుగా నమోదైంది. 51 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


Andhra Pradesh Weather: ఉత్తర ఛత్తీస్ గఢ్ పై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ ఛత్తీస్ గఢ్, దాని పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉంది. దక్షిణ తెలంగాణ, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. సగటు సముద్ర మట్టానికి ఒకటిన్నర కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉంది. ఒక ద్రోణి ఇప్పుడు దక్షిణ తెలంగాణ, పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకూ రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు


వీటి ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. దక్షిణ కోస్తాంధ్ర ప్రదేశ్ లోనూ తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని.. వేడి, తేమ వాతావరణం ఒకటి లేక రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.