Weather Latest News: తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. చలి విపరీతంగా పెరుగుతోంది. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వారు అంచనా వేశారు. ఆ తరువాత చలి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మళ్లీ డిసెంబరు ఆఖరి వారం నుంచి చలి తీవ్రత పెరుగుతుందని, అప్పుడు మరింతగా శీతల గాలులు వీస్తాయని వారు అన్నారు. 


రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదవుతోందని.. హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 నుంచి 13 డిగ్రీల మధ్యలో ఉంటున్నాయని తెలిపారు. తెలంగాణలో అత్యల్పంగా మెదక్‌ జిల్లాలో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్పారు. పగటి పూట ఉష్ణోగ్రతలు సగటున 28 - 31 డిగ్రీల మధ్య ఉంటున్నాయని చెప్పారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 31 డిగ్రీలు, అత్యల్పంగా 28 - 29 డిగ్రీల మధ్య హైదరాబాద్‌, నగర శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ అధికారులు చెప్పారు.


ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఈశాన్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం వుంది. తెలంగాణలో ఎలాంటి వాతావరణ హెచ్చరికలను జారీ చేయలేదు. 


హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 16 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో తూర్పు దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 16.6 డిగ్రీలుగా నమోదైంది. 59 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు దిశల్లో గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల.. ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.