Weather Latest News: తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులపాటు జోరు వానలు ఖాయమని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన రుతపవన ద్రోణి ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై బలంగా ఉందని అందుకే జోరు వానలు ఖాయమని చెబుతున్నారు.
ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడి ఉన్న అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందన్నారు. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులపాటు, తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వివరించారు.
Also Read: విజయవాడ వరదలపై రాజకీయం సరే - సాయమెంత ? విమర్శలకు వైసీపీ సమాధానమేంటి ?
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో శని ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో రుతుపవన ద్రోణి ఉన్నందున సముద్రం పోటెత్తుతోందని అందుకే అసలు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే భారీ వర్షాలతో విజయవాడతోపాటు పలు ప్రాంతాలు అల్లాడిపోయాయి. గత వారం నుంచి ఆ ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడకు ఇంకా వర్షాలు కురుస్తాయన్న వార్త కంగారు పెడుతోంది.
తెలంగాణలో అయితే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తాజాగా రిలీజ్ చేసిన బులెటిన్‌లో కీలక విషయాలు వెల్లడించింది. శనివారం తేలికపాటి వర్షాలే ఉంటాయని పేర్కొన్న వాతావరణశాఖ ఆదివారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అందుకే ఇవాళ రేపు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖాధికారులు సోమ మంగళవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
Also Read: తెలంగాణలో వరద బాధితుల కోసం భారీ విరాళాలు, ఎవరు ఎంతిచ్చారంటే!
హైదరాబాద్‌లో పరిస్థితి కూడా మిగతా జిల్లాల మాదిరిగానే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. గ్రేటర్ పరిధిలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు. వారం రోజుల నుంచి తెలంగాణలో వివిధి జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో కూడా వర్షాలు భారీగానే పడ్డాయి. రోజూ ఏదో ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం వివరాలు చూస్తే.. గచ్చిబౌలిలో భారీగా 4.30సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. బీహెచ్‌ఈఎల్, చందానగర్, ఫిల్మ్‌నగర్, షేక్‌పేటలో దాదాపు నాలుగు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. హయత్‌నగర్, ఆసిఫ్‌నగర్, హెచ్‌సీయూ, విజయనగర్‌కాలనీ, పటాన్‌చెరు, చార్మినార్ లలో 3 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. వచ్చే రెండు రోజులు కూడా భారీగా వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతుందన్నారు.