చినుకు జాడ లేదు... ఎండలతో ఠారెత్తిపోతున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఈ రెండు రోజులు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఏపీ తెలంగాణలోనే కాదు పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్, ఒడిశా, తమిళనాడులో ఇది పరిస్థితి కనిపిస్తోంది. వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరికొందరు ప్రాణాలు వదులుతున్నారు.
వడగాలులు తీవ్రం
సోమవారం, మంగళవారం ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని ఐఎండీ చెబుతోంది. ప్రజలకు జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం ప్రమాదం తప్పదని హెచ్చరిస్తోంది. గరిష్ణ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగానే నమోదు అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది. చల్లని ప్రదేశాల్లో ఉండేందుకు ట్రై చేయాలని సూచిస్తోంది. చిన్నారులు, వృద్దులు, గర్భణిలు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. నీళ్లు ఎక్కువ తాగాలని సూచిస్తోంది.
ఎల్లో అలర్ట్
తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ ప్రాంతాల్లో భారీగా వడగాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడ 4ం డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతుల రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది.
ఈ ప్రాంతం వాళ్లు జాగ్రత్త
ఆదివారం 16 జిల్లాల్లోని 39 మండలాల్లో వడగాలులు వీచాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. 24 మండలాల్లో తీవ్రమైన వడగాలులు నమోదయ్యాయి. ఇక్కడ సాధారణ ఉష్ణోగ్రత కన్నా 6.5 డిగ్రీలపైగా నమోదైంది. ఈ జాబితాలో పెద్దపల్లి జిల్లాలో 6 మండలాలు, కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాల్లో 3 చొప్పున, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో 2 చొప్పున,భువనగిరి, మంచిర్యాల, హనుమకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కో మండలాలు ఉన్నాయి.
ఏపీలో అదే పరిస్థితి
ఏపీలో పరిస్థితి చూస్తే 300 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. 23 మండలాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉండొచ్చని హెచ్చరించింది. బాపట్ల, అల్లూరి, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా వేస్తోంది. బిపర్‌జోయ్ తుపాను కారణంగా తలెత్తిన పరిస్థితులతో మరో 12 గంటలు వాతావరణం ఇలానే ఉండొచ్చు.
ఉత్తరాదిలో భిన్న వాతావరణం
గుజరాత్‌ను అతలాకుతలం చేసిన బిపర్జోయ్ తుపాను ప్రభావం ఇప్పుడు రాజస్థాన్, అసోంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కనిపిస్తోంది. రాజస్థాన్ లో వరద పరిస్థితి కొనసాగుతుండగా, అసోంలోని మూడు జిల్లాలు వరద నీటిలో మునిగిపోయాయి. రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో ప్రజలకు ఉపశమనం లభించింది.
రెండు రోజుల్లో వానలు
రానున్న రెండు రోజుల్లో బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అంటే మరో రెండు రోజుల్లో ఈ రాష్ట్రాలకు ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. ఢిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 38.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కాగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. సోమవారం దేశ రాజధానిలో ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
అసోంను ముంచేస్తున్న వర్షాలు
అసోంలో బ్రహ్మపుత్ర నది ఉధృతి కొనసాగుతోంది. అసోంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాష్ట్రంలోని మూడు జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. అంతే కాదు, 25 గ్రామాలు వరద నీటిలో ఉన్నాయి. అసోం అంతటా 215.57 హెక్టార్ల పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 37,535 మంది వరదల బారిన పడ్డారు. రాజస్థాన్ లో వరద పరిస్థితులు కొనసాగుతున్నాయి. బిపర్జోయ్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో రాజస్థాన్‌లోని జలోర్, సిరోహి, బార్మర్ జిల్లాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం 59 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.