Weather Latest Update: తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. కనిష్ట స్థాయిలి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఇలాంటి వాతావరణమే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. గిరిజన ప్రాంతాలు చలికి అల్లాడిపోతున్నాయి. 


ఆదిలాబాద్‌, వరంగల్‌ కరీంనగర్‌ జిల్లాలను మంచు మేఘాలు కమ్మేస్తున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదు అయింది. అక్కగడ 11 డిగ్రీల సెల్సియస్‌ రిజిస్టర్ అయింది. ఆదివారం మాత్రం ఆదిలాబాద్ జిల్లా అతి తక్కువ ఉష్ణోగ్రత 13.2 డిగ్రీలు నమోదు అయింది. గరిష్ణ ఉష్ణోగ్రత ఖమ్మం జిల్లాలో 30 డిగ్రీలుగా రిజిస్టర్ అయింది. మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... మూడు నాలుగు ప్రాంతాల్లో 15 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు రిజిస్టర్ అయ్యాయి. గరిష్ణ ఉష్ణోగ్రత కూడా ఒక్క ఖమ్మం మినహా అన్ని ప్రాంతాల్లో 25 నుంచి 28 మధ్యే ఉంది. 




వచ్చే నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని రోగాలు కొని తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. వచ్చే నాలుగు రోజుల పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 10 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. 


ఉదయాన్నే పొగ మంచుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పొగమంచు కమ్ముకున్నప్పుడు వాహనాలు నడిపేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మలుపులు తిప్పేటప్పుడు నెమ్మది అవసరం అంటున్నారు. హైవేల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. రోడ్లపై, రోడ్లకు ఆనుకొని వాహనాలు నిలుపుదల చేయొద్దని హితవు పలుకుతున్నారు. 


హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నాయి. మార్నింగ్ టైంలో పొగమంచు కారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది.  గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల వరకు ఉంటే కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉంటుంది. 


ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తక్కువ ఉష్ణోగ్రత శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం వద్ద నమోదు అయింది. 17 డిగ్రీలుగు అమరావతి వాతవరణ శాఖ ప్రకటించింది. మిగతా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకుపైనే ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత మచిలీపట్నంలో 32 డిగ్రీలుగా నమోదు అయింది. 






ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వాతావరణం పరిశీలిస్తే ఉత్తర కోస్తా, యానాంలో పొడి వాతావరణం ఉంటుంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ ఏరియాల్లో రెండు రోజులు అలానే ఉంటుంది. తర్వాత రోజు నుంచి పొడి వాతావరణం ఉంటుంది. రాయలసీమలో కూడా రెండు రోజుల పాటు అక్కడక్కడా వర్షాలకు ఛాన్స్ ఉంది.