Water Leak in Parliament: ఢిల్లీలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ నీళ్లతో నిండి పోయాయి. ప్రజా రవాణా నిలిచిపోయింది. ఈ ఎఫెక్ట్ కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌పైనా పడింది. పార్లమెంట్ బిల్డింగ్ లాబీలో పైకప్పు నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయంటూ కాంగ్రెస్ ఓ వీడియో షేర్ చేసింది. వాతావరణానికి తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం ఈ భవనానికి ఉందో లేదో అన్న అనుమానం కలుగుతోందని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గతేడాది మే లో ఈ కొత్త బిల్డింగ్‌ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. భారీగా ఖర్చు పెట్టి ఈ భవనాన్ని నిర్మించారు. బ్రిటీష్ కాలం నాటి ఆనవాళ్లు లేకుండా పూర్తిగా భారత దేశ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణం చేపట్టారు. అయితే...ఇంత గొప్పలు చెప్పిన బిల్డింగ్‌లో నీళ్లు లీక్ అవుతున్నాయంటూ కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది.
కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ X వేదికగా ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కి సెటైరికల్ క్యాప్షన్ కూడా ఇచ్చారు. "బయటేమో పేపర్ లీకేజ్‌లు..లోపలేమో వాటర్ లీకేజ్‌లు" అని చురకలు అంటించారు. ఈ లాబీలో రాష్ట్రపతి ఉంటారని, ఇంత కీలకమైన చోట నీళ్లు లీక్ అవడమేంటని ప్రశ్నించారు. పూర్తి స్థాయిలో బిల్డింగ్‌ని మరోసారి పరిశీలించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్‌సభలో ఓ తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేకంగా ఎంపీలతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లీక్‌కి కారణమేంటన్నది ఈ కమిటీయే పరిశీలించి వివరాలు వెల్లడిస్తుందని తేల్చి చెప్పారు మాణికం ఠాగూర్. (Also Read: Wayanad Landslide: మృతుల దిబ్బగా మారిన వయనాడ్- ముమ్మరంగా సహాయ చర్యలు- సాయం ప్రకటించిన సెలబ్రిటీలు)
ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా స్పందించారు. పాత పార్లమెంట్ బిల్డింగ్ చాలా బాగుండేదని అన్నారు. మళ్లీ పాత బిల్డింగ్ వెళ్తేనే మంచిందని స్పష్టం చేశారు. ఈ వాటర్ డ్రిప్పింగ్ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకైనా పాత బిల్డింగ్‌లో ఉంటే బాగుంటుందని మోదీ సర్కార్‌పై సెటైర్లు వేశారు.
ఢిల్లీలో కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అన్ని చోట్లా వరద నీళ్లు ముంచెత్తుతున్నాయి. IMD ఢిల్లీకి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వీలైనంత వరకూ అందరూ ఇళ్లలోనే ఉండాలని తేల్చి చెప్పింది. స్కూల్స్, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఢిల్లీ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే పైనా ట్రాఫిక్‌కి అంతరాయం కలుగుతోంది. పలు చోట్ల ఫ్లై ఓవర్‌లపు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఘాజీపూర్‌లో ఓ మూడేళ్ల చిన్నారి కాలువలో ప్రమాదవశాత్తూ పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. నోయిడాలో అండర్ పాస్‌లు నీళ్లతో నిండిపోయాయి. ఎయిర్‌లైన్స్ సర్వీస్‌లపైనా ప్రభావం పడింది. దాదాపు పది విమానాలను జైపూర్, లక్నోకి మళ్లించారు. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.