Wayanad News: మహప్రళయ భయానక పరిస్థితుల నుంచి కేరళలోని వయనాడ్‌(Wayanad) ఇంకా కోలుకోలేదు. ఎటు చూసినా మృత్యుదిబ్బలు, బంధువుల హాహాకారాలతో హృదయ విదారకంగా కనిపిస్తోంది. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న కొద్దీ మట్టికింద కప్పబడిన మృతదేహాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే చనిపోయిన వారి సంఖ్య 250 దాటేసింది. ఇంకా ఆచూకీ దొరకలని వారు వందలాది మంది ఉన్నారు.


ముమ్మరంగా గాలింపు
కేరళ(Kerala)లో జల ప్రళయం దాటికి కకావికలమైన వయనాడు కొండ ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాలేదు. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి వందలాది మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటికే మట్టి కింద నుంచి 250కి పైగా మృతదేహాలను సహాయ బృందాలు వెలికితీశాయి. వేలాది మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ప్రమాదకర ప్రాంతంలో చిక్కుకుని ప్రాణాలు  అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న వారిని రక్షించడమే గాక....మట్టి కింద కప్పేయబడిన మృతదేహాలను వెలికి తీసేందుకు సహాయ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.


రాష్ట్ర విపత్తు దళంతోపాటు ఎన్డీఆర్ఎఫ్‌(NDRF) బృందాలు, సైనిక బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాయి. ఇప్పటికీ కొంతమంది తీవ్రగాయాలతో సజీవంగానే ఉన్నారని, అలాంటి వారిని వీలైనంత త్వరగా రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సహాయ బృందాలు తెలిపాయి. ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు, గాయపడిన వారిని హెలీకాప్టర్ల ద్వారా ఆస్పత్రులకు తరలిస్తున్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇంకా కొండప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని అధికారులు పిలుపునిస్తున్నారు. కొందరిని బలవంతంగా శిబిరాలకు తరలించారు. ఇప్పటికే ఆస్పత్రులకు తరలించిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన బంధువులకు అప్పగించారు


సహాయ సహకారాలు
ప్రకృతి విపత్తుతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కేరళ(Kerala) రాష్ట్రానికి మిగిలిన రాష్ట్రాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ప్రమాద ప్రాంతంలో సహాయం అందించేందుకు ఇప్పటికే తమ రెస్క్యూ బృందాలను పంపాయి.ఇతర ప్రాంతాలకు చెందిన వైద్య బృందాలు సైతం తరలివచ్చాయి. ఇప్పటికే కేంద్రం సైనికి బృందాలను రంగంలోకి దింపింది. హెలీకాప్టర్లు, భారీ యంత్రాల సాయంతో ముమ్మరంగా రెస్కూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. అలాగే కేరళ సీఎం సహాయనిధికి కోట్లాది రూపాయల సాయం అందుతోంది. గౌతమ్‌ అదానీ(Adani) 5 కోట్లు, అలాగే లూలూ(Lulu) గ్రూప్‌, రవిపిళ్లై, కల్యాణ్‌ జ్యూవెలర్స్‌ సైతం తలో ఐదుకోట్లు విరాళం ప్రకటించారు. అటు రాజకీయ, సినీ ప్రముఖులు సైతం పెద్దఎ్తతున కేరళకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.


చియాన్ సాయం 


నటుడు చియాన్ విక్రమ్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందల మంది చనిపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల సహాయార్థం రూ.20 లక్షలు ఆర్థికసాయం కేరళ ప్రభుత్వానికి అందజేశారు. 


నేడు కేరళకు రాహుల్‌, ప్రియాంక
తన సొంత నియోజకవర్గం వయనాడు ప్రజలు ఆపదలో ఉండటంతో వారిని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) నేడు వయనాడు రానున్నారు. సోదరి ప్రియాంక(Priyanka)తో కలిసి ఆయన బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇప్పటికే కేరళ ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేసిన రాహూల్‌గాంధీ..మృతుల కుటుంబాలకు పరిహారం భారీగా పెంచాలని కోరారు. ఆపదలో ఉన్న కేరళను ఆదుకునేందుకు కేంద్రం ముందుకురావడం లేదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో స్వయంగా ఆయనే వయనాడ్ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లడం విశేషం. రాహూల్ సొంత నియోజకవర్గమైన వయనాడ్‌ ప్రజలు రెండుసార్లు ఆయన్ను ఎంపీగా గెలిపించారు. అందుకే వారికి ధైర్యం చెప్పేందుకు, బాధితులకు అండగా నిలిచేందుకు రాహూల్‌గాంధీ రంగంలోకి దిగారు.


Also Read: వయనాడ్ విధ్వంసానికి కారణమిదే, మరో రెండు రోజుల పాటు ఇదే బీభత్సం!


Also Read: భారత్‌ని వెంటాడుతున్న వరుస విపత్తులు, వరదలు తుఫాన్లతో విధ్వంసం