Volcano In Indonesia: అగ్ని పర్వాతాల కారణంగా ఇండోనేసియాలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తూర్పు జావాలోని వేలాది మంది నివాసితులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ద్వీపంలోని ఎత్తైన అగ్నిపర్వతం మౌంట్‌ సెమేరు (Mount Semeru) విస్ఫోటనం చెందడంతో 8 కిలోమీటర్ల మేర నో-గో జోన్‌ను విధించారు. అక్కడ మొత్తం గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించారు.






వరుస విపత్తులు


ఇటీవల భారీ భూకంపంతో అతలాకుతలమైన ఇండోనేసియాను ఇప్పుడు అగ్ని పర్వతాలు భయపెడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఈ అగ్ని పర్వ తం విస్ఫోటనం చెందింది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున లావా వెలువడటంతోపాటు దాదాపు ఒకటిన్నర కి.మీల ఎత్తువరకు దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో అధికారులు గరిష్ఠ స్థాయి హెచ్చరికలు జారీ చేశారు.






లావా ప్రవాహం తాకే అవకాశం ఉన్న బెసుక్ కొబోకాన్ నది ఆగ్నేయ ప్రాంతం నుంచి ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇండోనేసియా అగ్నిపర్వతాల, భూసంబంధిత ప్రమాదాల నివారణ కేంద్రం హెడ్‌ హెండ్రా గుణవాన్ సూచించారు. 


మౌనా లోవా


ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిపర్వతమైన హవాయి ద్వీపంలోని మౌనా లోవా నవంబర్‌ 28న బద్దలైంది. దీంతో భారీగా లావా, బూడిదను వెదజల్లింది. ఇప్పటికీ లావా ఎగజిమ్ముతోంది. దాదాపు 33 మీటర్ల నుంచి 200 మీటర్ల ఎత్తు వరకు లావా ఎగిసిపడుతోంది. అగ్ని పర్వత పరిసర ప్రాంతాలన్నీ బూడిదతో నిండిపోయాయి.




విస్ఫోటనానికి ముందు మౌనా లోవా చుట్టూ వరుస భూకంపాలు వచ్చాయి. రిక్టర్‌ స్కేల్‌పై 3.0 కంటే తక్కువ తీవ్రతతో 18 భూకంపాలు సంభవించాయి. కాగా, ఈ అగ్నిపర్వతం సముద్ర మట్టానికి 13,670 అడుగుల ఎత్తులో ఉంది. మౌనాలోవా చివరగా 1984లో చివరగా 20 రోజుల పాటు లావా వెదజల్లింది.


Also Read: Senegal Parliament Video: పార్లమెంటులో సభ్యుల మధ్య ఘర్షణ- మహిళా ఎంపీపై దాడి!