Gujarat Election 2022: ప్రధాని నరేంద్ర మోదీ.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాణిప్‌లోని నిషాన్ పబ్లిక్ స్కూల్‌లో మోదీ ఓటు వేశారు. ప్రస్తుతం గుజరాత్‌లో రెండో విడత పోలింగ్ జరుగుతోంది.
ప్రధాని మోదీతో పాాటు పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఓటు వేశారు. ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ షిలాజ్ అనుపమ్ స్కూల్‌లో పోలింగ్ బూత్ 95లో ఓటు వేశారు.
అహ్మదాబాద్‌లోని చంద్రనగర్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ బూత్ 264లో విరామ్‌గామ్ భాజపా అభ్యర్థి హార్దిక్ పటేల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోలింగ్ ఇలా
182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో 89 స్థానాలకు డిసెంబర్ 1న తొలి విడత పోలింగ్ జరిగింది. మిగిలిన 93 స్థానాలకు నేడు పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో భాజపా, ఆప్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల పరిధిలోని 93నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది.
ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల ఒకటిన 89 స్థానాలకు పోలింగ్ జరగగా.. 63.34 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే 3 శాతానికిపైగా ఓటింగ్ శాతం తగ్గింది.
రెండో విడత పోలింగ్ జరుగనున్న 93 స్థానాలకుగాను అన్నిపార్టీల తరఫున 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో 2.54 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారికోసం 26,409 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
Also Read: పెళ్లికాని అమ్మాయి, అబ్బాయి ఒకే హోటల్ గదిలో ఉండొచ్చా? ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి!