The Kerala Stroy Row  :  కేరళ స్టోరీ సినిమా వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆ సినిమాకు పన్ను మినహాయింపు ఇస్తూంటే ఇతర రాష్ట్రాలు బ్యాన్ చేస్తున్నాయి. బెంగాల్ లో ఈ సినిమా ప్రదర్శనను బ్యాన్ చేసింది మమతా బెనర్జీ ప్రభుత్వం. ఈ నిర్ణయాన్నిప్రకటిస్తూ.. ‘‘ది కశ్మీర్ ఫైల్స్’పై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. . ‘‘ది కశ్మీర్ ఫైల్స్’ ఏమిటి? అది ఒక వర్గాన్ని అవమానించడమే. ‘ది కేరళ స్టోరీ’ ఏమిటి? అది వక్రీకరించిన కథ. ఒక వక్రీకరించిన కథను ‘ది కేరళ స్టోరీ’గా బీజేపీ చూపిస్తోంది. కొన్ని రోజుల క్రితం బీజేపీ నిధులు సమకూరుస్తున్న స్టార్లు కొంత మంది బెంగాల్‌కు వచ్చారు. వారు ‘బెంగాల్ ఫైల్స్’ అనే వక్రీకరించిన, ఒక కల్పిత కథను తయారుచేస్తున్నారు’ అని ఆరోపించారు. ది కేరళ స్టోరీ సినిమా  సమాజంలో ఒక వర్గాన్ని అవమానించే విధంగా ఈ సినిమా ఉందని, దీని వల్ల హింసాత్మక ఘర్షణలు జరుగుతాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు సినిమాను నిషేధిస్తున్నామని మమత బెనర్జీ ప్రకటించారు.  


 





 


మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై   ‘ది కశ్మీర్ ఫైల్స్’  సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాతత అభిషేక్ అగర్వాల్  మండిపడ్డారు.  లీగల్ నోటీసు పంపారు. తమ సినిమాపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను వ్యతిరేకిస్తూ వారు ఈ లీగల్ నోటీసు పంపించారు. ఈ మేరకు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, ఆయన భార్య, నటి పల్లవి జోషి, అభిషేక్ అగర్వాల్ పేరిట లీగల్ నోటీసును హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది శ్యామ్ ఎస్ అగర్వాల్ పంపారు. ఈ లీగల్ నోటీసును వివేక్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్  సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో వాస్తవాలను వక్రీకరించారని, ఈ సినిమాకు బీజేపీ నిధులు సమకూర్చిందని మమతా బెనర్జీ చేసిన ఆరోపణలతో తమ పరువుకు నష్టం కలిగిందని  వివేక్ అగ్నిహోత్రితో పాటు ఇతరులు చెబుతున్నారు.  


‘ది కశ్మీర్ ఫైల్స్’  దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం  ‘ది ఢిల్లీ ఫైల్స్’ అనే సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.  ఈ సినిమా రీసెర్చ్‌లో భాగంగా మార్చిలో కోల్‌కతా వెళ్లిన వివేక్ అగ్నిహోత్రిపై అక్కడి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.  కోల్‌కతా మాల్‌లో తన సొంత పుస్తకం ‘అర్బన్ నక్సల్స్’పై సంతకం కూడా చేయనీయలేదని ఆరోపించారు. వీటన్నింటి వల్ల తనకు, తన చిత్ర బృందానికి పరువు నష్టం కలిగిందని, తక్షణమే క్షమాపణలు చెప్పాలని అగ్నిహోత్రి అంటున్నారు.