Visakha Police: ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి భార్యకు ఆరోగ్యం బాలేదు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాకు తీసుకువచ్చాడు. అయితే వైద్యుల చికిత్సకు ఆమె శరీరం సహకరించకపోవడంతో లాభం లేదు ఇంటికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. ఇలా భార్యను ఆటోలో సొంత గ్రామానికి తీసుకెళ్తుండగా మధ్యలోనే ప్రాణాలు విడిచింది. విషయం గుర్తించిన ఆటో డ్రైవర్ నడిరోడ్డుపై వాళ్లను కిందికి దింపేసి వెళ్లిపోయాడు. ఏం చేయాలో పాలుపోక అతడు భార్య శవంతో రోడ్డుపైనే కూర్చున్నాడు. విషయం గుర్తించిన స్థానిక పోలీసులు అతడికి సాయం చేశారు. అంబులెన్స్ తెప్పించి మరీ అతడిని సొంతూరికి పంపించేశారు.
అసలేం జరిగిందంటే..?
ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సొరడ గ్రామానికి చెందిన 30 ఏళ్ల వయలు ఉన్న ఈడే గురు అనే మహిళ గత కొంత కాలం కిందట అనారోగ్యానికి గురైంది. నిన్న ఆమె పరిస్థితి మరింతగా క్షీణించడంతో ఆమె భర్త సాములు.. గురును విశాఖపట్నం జిల్లా సంగివలస వద్ద గల అనిల్ నీరుకొండ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. చికిత్స అందించిన వైద్యులు.. ఆమె శరీరం వైద్యానికి స్పందించడం లేదని ఇక్కడ ఉంచితే ఏం లాభం లేదు, తిరిగి సొంత ఊరు తీసుకొని వెళ్లిపోవాలని తెలిపారు. చేసేది ఏమీ లేక సాములు భార్యను తీసుకొని ఆటోలో విజయనగరం వస్తుండగా మార్గ మధ్యంలో ఆమె మరణించింది. ఆర్ధంతరంగా ఆటో డ్రైవరు చెల్లూరు రింగు రోడ్డులో వారిని దించేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో భర్త.. భార్య మృతదేహాన్ని ఎలా ఒడిశాకు చేర్చాలో తెలియక శవాన్ని భుజం మీద వేసుకొని కాలి నడకన బయలు దేరాడు.
విషయం తెలుసుకొని అండగా నిలబడ్డ పోలీసులు
ఏమైందని మార్గ మధ్యంలో చాలా మంది స్థానికులు అడిగినప్పటికీ.. ఆయన ఒడియాలో మాట్లాడుతుండడంతో వాళ్లకు ఏమీ అర్థం కాలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ టివి తిరుపతి రావు, గంట్యాడ ఎస్ఐ కిరణ్ కుమార్ తో కలిసి చెళ్లూరు రింగు రోడ్డుకు వెళ్లి పరిశీలించారు. మహిళ మృతదేహాన్ని భుజాన వేసుకుని వెళ్తుండటాన్ని గమనించి, అతని ద్వారా విషయం అడిగి తెలుసుకున్నారు. ఒడిస్సాలో అతని బంధువులతో ఫోనులో మాట్లాడారు. వారి విజ్ఞప్తి మేరకు రూరల్ సీఐ టివి తిరుపతిరావు ఒడిస్సా రాష్ట్రం సుంకి వరకు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. వారిని అంబులెన్స్ లో ఒడిశా రాష్ట్రం సుంకికి ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించి, మానవత్వం చాటుకున్నారు.
పోలీసులు అందించిన సహాయానికి సాములు కృతజ్ఞతలు తెలపగా.. స్పందించిన పోలీసులను స్థానికులు అభినందించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనంటూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘనటలు అంటే డబ్బులు లేకపోవడం వల్ల ఎవరూ సాయం చేయకపోవడం వల్ల చాలా మంది మృతదేహాలను మోసుకుంటూ వెళ్లిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటివి చూసిన తర్వాత చాలా మంది అయ్యో అనుకోవడం కంటే మన కంటపడ్డ వెంటనే సాయం చేస్తే చాలా బాగుుంటుందని నిరూపించారు విశాఖ పోలీసులు.