Mandava Venkateshwara Rao:  మండవ వెంకటేశ్వర రావు రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీలో మొదలైంది. ఎండ్ కూడా ఆ పార్టీ లొనే చేయాలనుకుంటున్నారా... అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలానే కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పలుమార్లు అధికారంలోకి వచ్చింది.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మారిన రాజకీయాల పరిణామాలతో పార్టీ ప్రభావం మసక బారుతూ వచ్చింది. ఇప్పటికీ టీడీపీ క్యాడర్ తెలంగాణలో కొన్ని చోట్ల బలంగానే ఉంది. అయితే తెలంగాణలో పార్టీకి మళ్ళీ జీవాలు పోయాలన్న సంకల్పంతో టిడిపి అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. 


ఆ స్థానాలపై టీడీపీ ఫోకస్
గతంలో టీడీపీకి పట్టున్న జిల్లాలపై, అలాగే సెటిలర్స్ ఎక్కువగా ఉన్న నియోజక వర్గాలపై మరింత ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావును రాష్ట్ర టీటీడీపీలో యాక్టివ్ చేసేందుకు చంద్రబాబు డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో మండవ బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్ పార్టీ) లో చేరినప్పటికీ ఆయన ఆ పార్టీకి అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయoలో నిజామాబాద్ జిల్లాలో ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీకి ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. 


5 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన మండవ 
మండవ సీనియర్ లీడర్. మంచి అనుభవం ఉన్న నేత. మంత్రిగా సైతం సేవలు అందించిన అనుభవం ఆయన సొంతం. నిజామాబాద్ రూరల్ నాటి డిచ్ పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మండవ. మంత్రి పదవులు కూడా చేపట్టారు. చంద్రబాబుకు నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సమయంలో తెలంగాణలో టీడీపీకి మండవ లాంటి సీనియర్లు అవసరమని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు మళ్ళీ టీటీడీపీలో మండవకు కీరోల్ పోషించే బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నిజామాబాద్ జిల్లాలో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ సమయంలోనే మండవ తిరిగి పార్టీలో యాక్టివ్ అవుతారని టీటీడీపీ వర్గాలు అంటున్నాయి. 


మరోవైపు నిజామాబాద్ జిల్లాలో సెటిలర్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు. జిల్లాకే చెందిన నేత కావటంతో టీడీపీకి మళ్ళీ ఊపు వస్తుందన్న భావనలో పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. పైగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో జతకట్టే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ అలాకాని పక్షంలోనూ నిజామాబాద్ రూరల్ నుంచి మండవ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. రూరల్ నియోజకవర్గంపై మండవకు మంచి పట్టుంది. సెటిలర్స్ ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గం నుంచే మండవకు 5 సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన రికార్డు ఉంది. జిల్లాలో టీడీపీ ఓటు బ్యాంకు ఇంకా మెరుగ్గానే ఉండటంతో నిజామాబాద్ జిల్లాపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధం కావటానికి చంద్రబాబు అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచిస్తున్నారని, మొత్తానికి మండవ మళ్ళీ పాత గూటికి చేరి పార్టీని ముందుండి నడిపిస్తారన్న ప్రచారం జోరందుకుంది.