Fight on Bangkok-India flight:
పిడిగుద్దులతో దాడి..
బ్యాంకాక్ నుంచి ఇండియాకు వచ్చే స్మైల్ ఎయిర్‌వేస్ ఫ్లైట్‌లో ఇద్దరు ఇండియన్స్ ఘర్షణకు దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాటలతో మొదలైన గొడవ..చివరకు పిడిగుద్దుల వరకూ వెళ్లింది. ఇద్దరూ చాలా సేపు వాగ్వాదం జరిగాక...ఉన్నట్టుండి ఓ నలుగురు వచ్చి ఒక వ్యక్తిపై దాడికి దిగారు. ముఖంపై ఇష్టమొచ్చినట్టు కొట్టారు. ఫ్లైట్ సిబ్బంది వాళ్లను ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. దయచేసి ఆపేయండి అంటూ మైక్రోఫోన్‌లో క్రూ మెంబర్స్ అనౌన్స్ చేసినా పట్టించుకోకుండా దాడి చేశారు. మిగతా ప్రయాణికులంతా అలాగే చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి తేరుకుని వాళ్లను ఆపేందుకు ప్రయత్నించినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. ఆ ఫ్లైట్‌లోని ప్రయాణికుడు ఈ గొడవనంతా వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. క్షణాల్లో ఇది వైరల్ అయిపోయింది. అసలు గొడవకు కారణమేంటని ఆరాతీస్తే...ఓ సీట్ విషయంలోనే వాళ్లు అంతగా ఘర్షణ పడ్డారని తేలింది. టేకాఫ్ సమయంలో విమానంలోని సిబ్బంది ముందస్తు జాగ్రత్తగా సీట్స్‌ను అడ్జస్ట్ చేసుకోవాలని సూచించింది. అయితే...ఓ ప్రయాణికుడు అందుకు అంగీకరించలేదు. తనకు నడుము నొప్పి ఉందని చెప్పాడు. సీట్‌ను పూర్తిగా వెనక్కి జరిపి రిక్లైనర్‌గా మార్చేశాడు. వెనక ఉన్న ప్రయాణికుడు దీనిపై సీరియస్ అయ్యాడు. టేకాఫ్ సమయంలో సీట్ ఇలా ఉంటే ప్రమాదమని, పైకి అనుకోవాలని సిబ్బంది చెప్పినా ఆ వ్యక్తి వినిపించుకోలేదు. ఈ విషయంలో మాట మాట పెరిగి ఆ ప్రయాణికులు ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు.
ఇండిగోలో మరో ఘటన..
ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో ఓ ప్రయాణికుడు వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అవుతోంది. ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగినట్టు ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఎయిర్ హోస్టెస్‌కు, ప్రయాణికుడికి మధ్య గొడవ జరుగుతుండగా...మరో ప్రయాణికుడు వీడియో తీశాడు. ఆహారం విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఎక్కువగా ఆప్షన్స్ ఇవ్వలేదని, లిమిటెడ్‌గా పెట్టారని ప్రయాణికుడు గొవడకు దిగాడు. అయితే...దీనిపై ఇండిగో సంస్థ యాజమాన్యం ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లలో కొందరు ఇండిగో సిబ్బందిని తిట్టి పోస్తుండగా..మరి కొందరు మాత్రం వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 19న ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ అయింది. ప్రయాణికుడు వాగ్వాదానికి దిగాడు. "ఎందుకు అరుస్తున్నావ్" అంటూ ప్రశ్నించాడు. అందుకు వెంటనే "మీరే మాపై అరుస్తున్నారు కాబట్టి" అని గట్టిగా బదులిచ్చింది ఎయిర్ హోస్టెస్. "ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. మేమెంతో గౌరవంగా మీకు అంతా వివరిస్తున్నాం. మీరు కూడా మమ్మల్ని గౌరవించాలి" అని చెప్పింది. అయితే...ఆ ప్యాసింజర్ వేలెత్తి చూపిస్తూ "నోర్మూయ్" అని అరిచాడు. దీంతో...ఆగ్రహంతో ఊగిపోయిన ఎయిర్ హోస్టెస్ "నేను మీ సర్వెంట్‌ని కాను" అని గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడితో ఈ వాగ్వాదం ముగిసిపోయింది. ఆ తరవాత ఏం జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు.