Viral Video:
దట్టమైన అడవులు ధ్వంసం చేసి వాటి మధ్య రోడ్లు వేసుకుంటున్నాం. ఒక్కోసారి ఆ రోడ్డు దాటుతూ మూగజీవాలు ప్రమాదాలకు గురై చనిపోతున్నాయి. ఏటా ఇలా ఎన్నో జంతువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే ఇలా వన్యప్రాణులు రోడ్డు దాటుతుంటే భయపడటమో,వాటిని భయపెట్టడమో చేస్తుంటారు చాలా మంది. కానీ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం ఇందుకు భిన్నంగా చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఆయనకు సెల్యూట్ చేస్తోంది. మహారాష్ట్రలో దట్టమైన అడవి మధ్యలో రోడ్డు మార్గం ఉంది. అక్కడ తరచుగా వన్యప్రాణులు రోడ్డు దాటుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే అక్కడ ఓ పులి రోడ్డు క్రాస్ చేసేందుకు ప్రయత్నించింది. వాహనాలు అటు ఇటు వేగంగా తిరగటం చూసి ఆగిపోయింది. ఇది చూసిన ట్రాఫిక్ పోలీస్ వెంటనే వాహనదారుల్ని ఎక్కడికక్కడే ఆపేశాడు. ట్రాఫిక్ అంతా క్లియర్ చేశాడు. వెంటనే ఆ పులి రాజసంగా నడుచుకుంటూ రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోయింది. ఓ బైక్‌పైన ఉన్న వ్యక్తి అత్యుత్సాహంతో కిందకు దిగి
వీడియో తీయబోతుండగా, ట్రాఫిక్ పోలీస్ వారించాడు. నిశ్శబ్దంగా ఉండాలంటూ సూచించాడు. అందరూ సైలెంట్ అయిపోయాక ఆ పులి మెల్లగా అడవిలోకి వెళ్లింది. అది వెళ్లిపోయేంత వరకూ వాహనదారులంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియోను ఓ ఫారెస్ట్ అధికారి ట్విటర్‌లో షేర్ చేశారు. "పులి కోసం గ్రీన్ సిగ్నల్ వేశారు" అని ట్వీట్ చేశారు. అయితే ఇది ఎక్కడ జరిగింది అన్నది మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. కొందరు బ్రహ్మపురి, నగ్‌బిర్ మార్గ మధ్యలో జరిగి ఉంటుందని చెబుతున్నారు.