వెబ్ సిరీస్ రివ్యూ: ఏజెంట్ ఆనంద్ సంతోష్
నటీనటులు: షణ్ముఖ్ జస్వంత్, వైశాలి రాజ్, అలంకృత షా, పృథ్వీ జఖాస్ తదితరులు
సినిమాటోగ్రఫీ: దనుష్ భాస్కర్
సంగీతం: అజయ్ అరసాడకథ: సుబ్బు కె
దర్శకత్వం: అరుణ్ పవార్
విడుదల తేదీ: జూలై 22, 2022
ఓటీటీ వేదిక: ఆహా


యూట్యూబర్ గా తనకంటూ ఓ ఇమేజ్ ని సంపాదించుకున్నారు షణ్ముఖ్ జశ్వంత్. సోషల్ మీడియాలో అతడి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ షో వలన అతడిపై కొంత నెగెటివిటీ వచ్చినప్పటికీ.. కెరీర్ పరంగా ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. ఇప్పటికే యూట్యూబ్ లో పలు సిరీస్ లు చేసిన షణ్ముఖ్ 'ఆహా' కోసం మరో వెబ్ సిరీస్ చేశారు. అదే 'ఏజెంట్ ఆనంద్ సంతోష్'. శుక్రవారం నాడు ఈ సిరీస్ కి సంబంధించిన రెండు ఎపిసోడ్స్ ను విడుదల చేశారు. అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం!


కథ:


ఆనంద్ సంతోష్ (షణ్ముఖ్ జస్వంత్) ఒక డిటెక్టివ్ ఏజెంట్. తన స్నేహితుడు అయోమయం(పృథ్వీ జఖాన్)తో కలిసి సిల్లీ కేసులు పరిష్కరిస్తుంటారు. పక్కింట్లో వారి చెప్పులు పోయాయని, వాటర్ క్యాన్ మిస్ అయిందని ఇలాంటి కేసులు అతడి దగ్గరకి వస్తుంటాయి. సరైన కేసు కోసం ఎదురుచూస్తుంటాడు ఆనంద్ సంతోష్. అదే సమయంలో తను ప్రేమించిన అమ్మాయి తండ్రి.. ఉద్యోగం చేస్తేనే పెళ్లి చేస్తానని చెప్పడంతో.. తన ప్రేమ కోసం ఒక డిటెక్టివ్ ఆఫీస్ లో జాయిన్ అవుతాడు ఆనంద్ సంతోష్. ఆ ఆఫీస్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. అందులో మెయిన్ రూల్ ఏంటంటే.. వారి స్థోమతకు మించిన కేసులు ఒప్పుకోకూడదు. అదే సమయంలో హైదరాబాద్‌లోని కూకక్‌ట్‌పల్లిలో కొంతమంది అమ్మాయిల కిడ్నాప్‌లు జరుగుతుంటాయి. మరి కేసుని ఆనంద్ సంతోష్ ఒప్పుకుంటాడా..? అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూడాలి!


రెండు ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయంటే..?


ఏజెంట్ ఆనంద్(షణ్ముఖ్)ని చంపడానికి రౌడీలు వెంటపడే సన్నివేశంతో మొదటి ఎపిసోడ్ మొదలైంది. 'పోకిరి'లో మహేష్ బాబు రేంజ్ లో హీరోకి ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆ తరువాత క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ.. కామెడీ సీన్స్ తో స్టోరీని నడిపించారు. పేరెంట్స్ కి చెప్పకుండా ఒక అమ్మాయి ట్రిప్ కి వెళ్తుంది. దీంతో ఆమె మిస్ అయిందనుకొని ఏజెంట్ ను సంప్రదిస్తారు తల్లిదండ్రులు. ఆ కేసుని పరిష్కరించడానికి హీరో, అతడి స్నేహితుడు అమ్మాయి ఇంటికి వెళ్లే సన్నివేశాలు కాస్త ఇరిటేట్ చేస్తాయి. వెబ్ సిరీస్ కాబట్టి డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్లకుండా చిన్న చిన్న ప్లాట్స్ తో నిదానంగా స్టోరీలోకి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు.


అందుకే మొదటి రెండు ఎపిసోడ్స్ లో పెద్దగా మేటర్ ఏం లేదు. హీరో క్యారెక్టర్, అతడి ప్రేమ కథ, కొన్ని కామెడీ సన్నివేశాలను చూపించారు. ముప్పై నిమిషాల గల ఈ రెండు ఎపిసోడ్స్ ఏవరేజ్ గా ఉన్నాయి. ఏజెంట్ పాత్రలో షణ్ముఖ్ బాగానే నటించాడు. అతడి కామెడీ టైమింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ గా పృథ్వీ పర్వాలేదనిపించారు. ఇన్నోసెంట్ ఏజెంట్ గా కనిపించాడు. మిగిలిన నటీనటులు తమవంతు న్యాయం చేశారు. 


ఈ సిరీస్ కి రైటర్ గా పని చేసిన సుబ్బు.. ఇదివరకు 'సూర్య', 'సాఫ్ట్ వేర్ డెవెలపర్' వంటి హిట్ వెబ్ సిరీస్ లకు పని చేశారు. మరి ఈ సిరీస్ కి ఎలాంటి కథ అందించారో పూర్తి ఎపిసోడ్స్ విడుదలైతే గానీ చెప్పలేం. దర్శకుడిగా అరుణ్ పవార్ ఈ రెండు ఎపిసోడ్స్ ను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. కొన్ని సన్నివేశాలను బాగానే తీయగలిగారు. టెక్నికల్ గా ఈ సిరీస్ పర్వాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ సిరీస్ కి తగ్గట్లుగా ఉన్నాయి. 


పూర్తి ఎపిసోడ్స్ తో త్వరలోనే మీకు రివ్యూ అందిస్తాం. ప్రస్తుతానికి 'ఆహా'లో ఈ రెండు ఎపిసోడ్స్ చూసి ఎంజాయ్ చేసేయండి!


Also Read : 'కలర్ ఫోటో' ఎందుకంత స్పెషల్? నేషనల్ అవార్డు కంటెంట్ క్రియేటర్లకు ఎటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది?


Also Read : తొలి ఛాన్స్ నుంచి 'ఆకాశమే నీ హద్దురా' వరకూ - సూర్య నేషనల్ అవార్డ్ కుటుంబానికి అంకితం