Viral Video:
ప్యాసింజర్ - ఎయిర్ హోస్టెస్ వాగ్వాదం
ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో ఓ ప్రయాణికుడు వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అవుతోంది. ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగినట్టు ఓ నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఎయిర్ హోస్టెస్‌కు, ప్రయాణికుడికి మధ్య గొడవ జరుగుతుండగా...మరో ప్రయాణికుడు వీడియో తీశాడు. ఆహారం విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఎక్కువగా ఆప్షన్స్ ఇవ్వలేదని, లిమిటెడ్‌గా
పెట్టారని ప్రయాణికుడు గొవడకు దిగాడు. అయితే...దీనిపై ఇండిగో సంస్థ యాజమాన్యం ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లలో కొందరు ఇండిగో సిబ్బందిని తిట్టి పోస్తుండగా..మరి కొందరు మాత్రం వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 19న ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ అయింది. "ఇండిగోలో టికెట్ బుక్ చేసుకుని పెద్ద తప్పు చేశాను" అని గురుప్రీత్ సింగ్ అనే యూజర్ ట్వీట్ చేశారు.
"ప్రతి ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో ఫుడ్ చాయిస్ ఉంటుంది. కొందరు పర్లేదులే అని మేనేజ్ చేసుకుంటారు. కొందరు అలా కన్విన్స్ అవ్వలేరు" అని ట్వీట్ చేశారు. "ఇండిగో సిబ్బంది ప్రయాణికుడితో ఎలా ప్రవర్తించిందో.. ప్రయాణికుడు ఆ అమ్మాయితో ఎలా బిహేవ్ చేశాడో నేను కళ్లారా చూశాను" అని కామెంట్ చేశాడు. ఈ వీడియోలో ఎయిర్ హోస్టెస్ ముఖం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ...ఆ ప్రయాణికుడు ఎవరన్నది మాత్రం తెలియలేదు. ఆ ప్రయాణికుడు తమతో చాలా దురుసుగా ప్రవర్తించాడని, ఈ కారణంగానే ఓ యువతి కన్నీళ్లు కూడా పెట్టుకుందని సిబ్బంది ఆరోపిస్తోంది.
ఇలా జరిగింది..
ఎయిర్ హోస్టెస్ ఫుడ్ విషయంలో ప్రయాణికుడికి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. "మా వైపు వేలెత్తి చూపిస్తూ అరుస్తూ మాట్లాడుతున్నారు. మీ వల్లే మాలో ఒకరు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మా కార్ట్‌లో ప్యాసింజర్స్‌కి సరిపడ మీల్స్ ఉన్నాయి. వాటికంటూ ఓ కౌంట్ ఉంది. అవి మాత్రమే మేం సర్వ్ చేయగలం" అని చెప్పింది ఎయిర్ హోస్టెస్. ఇంతలో ప్రయాణికుడు వాగ్వాదానికి దిగాడు. "ఎందుకు అరుస్తున్నావ్" అంటూ ప్రశ్నించాడు. అందుకు వెంటనే "మీరే మాపై అరుస్తున్నారు కాబట్టి" అని గట్టిగా బదులిచ్చింది ఎయిర్ హోస్టెస్. "ఇలా మాట్లాడుతున్నందుకు క్షమించండి. మేమెంతో గౌరవంగా మీకు అంతా వివరిస్తున్నాం. మీరు కూడా మమ్మల్ని గౌరవించాలి" అని చెప్పింది. అయితే...ఆ ప్యాసింజర్ వేలెత్తి చూపిస్తూ "నోర్మూయ్" అని అరిచాడు. దీంతో...ఆగ్రహంతో ఊగిపోయిన ఎయిర్ హోస్టెస్ "నేను మీ సర్వెంట్‌ని కాను" అని గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అక్కడితో ఈ వాగ్వాదం ముగిసిపోయింది. ఆ తరవాత
ఏం జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు.