Adar Poonawalla on Covid:
ఆందోళన చెందొద్దు: అదర్ పూనావాలా
చైనాలో మరోసారి కరోనా కేసులు తీవ్రమవుతున్నాయి. దాదాపు నెల రోజులుగా అక్కడ కొవిడ్ వ్యాప్తి అనూహ్యంగా పెరుగుతోంది. మొన్నటి వరకూ జీరో కొవిడ్ పాలసీతో కఠిన ఆంక్షలు విధించింది చైనా ప్రభుత్వం. అయితే...దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడం వల్ల వెంటనే వాటిని సడలించింది. అప్పటి నుంచి మళ్లీ బాధితుల సంఖ్య పెరుగుతూ పోతోంది. అయితే..చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ప్రభావం మిగతా దేశాలపైనా పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారత్ అప్రమత్తమైంది. కేంద్రఆరోగ్య మంత్రి నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ క్రమంలోనే సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే అయినా...భారత్ ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. "భారత్‌లో వ్యాక్సినేషన్ కవరేజ్ రికార్డు స్థాయిలో ఉంది. భయపడాల్సిన పని లేదు" అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ప్రజలకు సూచించారు. "చైనాలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయన్న వార్తలు కాస్త ఆందోళన కలిగిస్తున్న మాట నిజమే. కానీ...మన దేశంలో వ్యాక్సినేషన్ కవరేజ్ చాలా బాగుంది. అందుకే భయపడాల్సిన పని లేదు. భారత ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉంచాలి. జాగ్రత్తలూ పాటించాలి" అని ట్వీట్ చేశారు అదర్ పూనావాలా.
చైనాలో తీవ్రం..
చైనాలో కఠినమైన కొవిడ్ -19 ఆంక్షలను సడలించిన తరువాత.. వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రాబోయే నెలల్లో చైనాలో మిలియన్లకు పైగా మరణాలను సంభవించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న కేసులతో చైనాలోని ఆసుపత్రులు కిటకిటలడుతున్నాయి. వచ్చే 90 రోజుల్లో చైనాలోని 60 శాతానికి పైగా ప్రజలకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫెఇగ్ల్ -డింగ్ అంచనా వేశారు. ఎరిక్ సోమవారం ట్విట్టర్‌లో ఒమిక్రాన్ వేరియంట్ గురించి అనేక విషయాలు వెల్లడించారు. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఆర్ విలువ 16గా ఉందని.. అంటే వ్యాధి సోకిన వ్యక్తి నుంచి 16 మందికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. ఎపిడెమియాలజిస్ట్ అంచనా ప్రకారం 60 శాతానికి పైగా చైనా ప్రజలు, అంటే 10 శాతం భూ జనాభా వచ్చే 90 రోజుల్లో వైరస్‌కు గురవుతారు. మరణాల సంఖ్య మిలియన్లలోనే ఉంటుందని తెలిపారు. చైనా తన కరోనా కట్టడి నిబంధనలను ఇలానే సడలిస్తే మిలియన్ కంటే ఎక్కువ మంది మరణించే ప్రమాదం ఉందని ఓ అమెరికా సంస్థ పేర్కొంది. మరోవైపు యూఎస్, దక్షిణ కొరియా, బ్రెజిల్‌లో కూడా కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు రావడంతో.. భారత్‌లో కరోనావైరస్ పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుక్ మాండవీయ ఈ రోజు కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
Also Read: Bharat Jodo Yatra: మంత్రిగారూ మీరు ముందు ప్రధానికి లేఖ రాయండి - మన్‌సుక్‌పై గహ్లోట్ ఫైర్