Cyber Attacks in India: గతంలో ఎప్పుడూ కని, విని ఎరుగని మోసాలను ఈ 10 సంవత్సరాల్లో మనం చూస్తున్నాం, తరచూ వింటున్నాం. గత దశాబ్ద కాలంగా పరిస్థితి చాలా మారింది. డిజిటల్ ఇండియాలో ఆర్థిక లావాదేవీలతో పాటు మోసాలు, బాధితులు పెడుతున్న కేసుల సంఖ్య పెరిగింది. సాంకేతికత పరిధి పెరుగుతున్న కొద్దీ సైబర్ దాడుల ముప్పు కూడా పెరుగుతోంది.


ఒక నివేదిక ప్రకారం... అక్టోబర్ 2022 నుంచి, మన దేశంలో ప్రతి నిమిషం తొమ్మిది మంది ఇంటర్నెట్ వినియోగదారులు డేటా హ్యాకింగ్‌ ముప్పును ఎదుర్కొంటున్నారు. తమ ఖాతాల్లో దాచుకున్న డబ్బు; ఫోన్లు, కంప్యూటర్లలో భద్రపరుచుకున్న సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులకు కోల్పోతున్నారు. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు.


సైబర్ దాడుల విషయంలో భారత్ కంటే అమెరికా, రష్యా ముందు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.


ప్రపంచంలో టాప్ 5 సైబర్ దేశాల్లో భారత్
సైబర్ దాడుల నివేదిక చెబుతున్న ప్రకారం... 2004 నుంచి చూస్తే, అమెరికాలో 246 మిలియన్లు (24.6 కోట్లు), రష్యాలో 225 మిలియన్లు ‍‌(22.5 కోట్లు), భారత దేశంలో 26.5 మిలియన్ల ‍‌(2.6 కోట్లు) డేటా హ్యాకింగ్‌ సమస్యలు ఎదురయ్యాయి. అంతేగాక, డేటా చోరీ అత్యధికంగా జరిగిన దేశాల జాబితాలో భారత దేశం టాప్ 5లో ఉంది. సైబర్ దాడుల నివేదిక ప్రకారం, భారత దేశంలో 14.3 కోట్ల పాస్‌వర్డ్‌లు, 7.3 కోట్ల పేర్లు, 7.9 కోట్ల ఫోన్ నంబర్లు సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కాయి. ఈ సమాచారాన్ని వాళ్లు ఇతర ఆర్థిక నేరస్తులకు అమ్ముకోవడమో, లేదా తామే బ్యాంక్‌ ఖాతాల్లోకి చొరబడి డబ్బును తరలించుకుపోవడమో, లేదా సున్నితమైన సమాచారాన్ని దొంగిలించి డబ్బుల కోసం బెదిరించడమో చేసిన సంఘటనలు, నమోదైన కేసులు ఉన్నాయి.


సైబర్ దాడుల నుండి బయటపడే మార్గాలు:


1. సైబర్ దాడులను నివారించే అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు తప్పనిసరిగా డేటా బ్యాకప్‌ని ఏర్పాటు చేసుకోవాలి. తరచూ బ్యాకప్‌ అప్‌డేట్‌ చేస్తుండాలి లేదా ఆటోమేటిక్‌ బ్యాకప్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌ను ఆన్‌ చేసి ఉండాలి.


2. మీ ఫోన్‌ లేదా కంప్యూటర్‌లో మంచి యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ లేదా ఫైర్‌వాల్ ఉపయోగించండి. అలాగే, మీ ఫోన్‌ లేదా కంప్యూటర్‌ను ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూ ఉండండి.


3. మీకు SMS, ఈ-మెయిల్‌, వాట్సప్‌ సహా ఏ మార్గంలోనైనా మీకు తెలీని, అనుమానాస్పద వెబ్‌ లింక్స్‌ వచ్చినా వాటి మీద క్లిక్ చేయవద్దు. ఒకవేళ, మీకు గతంలో తెలీని వెబ్‌ లింక్‌ మీద క్లిక్‌ చేసే ముందు, ఆ వెబ్‌సైట్ నమ్మకమైనదో, కాదో ముందుగా ధృవీకరించుకోండి.


4. మీ లాగిన్ పాస్‌వర్డ్‌ ఎప్పుడూ బలంగా ఉండాలి. బయటి వ్యక్తులు దానిని అంత సులభంగా ఊహించలేకుండా ఉండాలి. అలాగే.. ఖాతా పాస్‌వర్డ్‌లో మీది గానీ, మీ కుటుంబ సభ్యులది గానీ, మీకు ఇష్టమైన వారిది గానీ పుట్టిన తేదీ, పేరు, ఫోన్‌ నంబర్లు, చిరునామా, మీ బైక్‌ లేదా కార్‌ నంబర్లు, ఆధార్‌, పాన్‌ నంబర్లు వంటివి ఉపయోగించవద్దు. 


5. అంకెలు, అక్షరాలు, చిహ్నాలతో మీ ఖాతా పాస్‌వర్డ్‌ను సృష్టించండి. క్యాపిటల్‌ లెటర్స్‌తో పాటు అంకెలు, ప్రత్యేక చిహ్నాలను తప్పకుండా పాస్‌వర్డ్‌లో చేర్చండి.


6. ఈ-మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్, క్రెడిట్ కార్డ్ లేదా బ్యాంక్ వివరాల వంటి మీ సమాచారాన్ని మీ ఫోన్‌, కంప్యూటర్‌లో దాచుకోవద్దు. కొంతమంది, ఫోన్‌లోని కాంటాక్ట్‌ నంబర్ల రూపంలో కీలక సమాచారాన్ని సేవ్‌ చేస్తుంటారు. సైబర్‌ నేరగాళ్లకు ఈ విషయం కూడా తెలుసు, వాళ్లు మీ కంటే తెలివైన వ్యక్తులు. అంతేకాదు, ఏ వెబ్‌సైట్‌లోనూ కీలక సమాచారాన్ని షేర్ చేయవద్దు.


7. మీకు తెలియని లేదా సురక్షితం కాని వెబ్‌సైట్‌ల నుంచి చిన్నపాటి సమాచారాన్ని కూడా డౌన్‌లోడ్ చేసుకోవద్దు.


8. మీ సిస్టమ్‌ను ఎల్లప్పుడూ రీఫ్రెష్‌ చేస్తూ ఉండండి.


9. మిమ్మల్ని ఊరించే, మీకు తెలియని ఈ-మెయిల్స్‌, స్పామ్ సందేశాలను తెరవడం మానుకోండి (ఉదా... ఆన్‌లైన్ లాటరీ, జాక్‌పాట్, బంపర్ డ్రా వంటివి).


10. ఉచిత పబ్లిక్ Wi-Fiని ఉపయోగించవద్దు. సగం హ్యాకింగ్‌ కేసులు ఈ విషయంలోనే జరుగుతున్నాయి.