తెలంగాణలో కొద్ది రోజుల క్రితం భగ్గుమన్న డ్రగ్స్ ఛాలెంజ్ వ్యవహారం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీఆర్‌ఎస్‌, బీజేపీ లీడర్ల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవిత పేరు ఉండడం దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. అప్పుడెప్పుడో విసిరిన డ్రగ్స్ ఛాలెంజ్‌కు ఇప్పుడు కేటీఆర్ స్పందించడంపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. బుధవారం (డిసెంబరు 21) తాజాగా ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ ముఖంలో భయం కనిపిస్తోందని, ఆయన డిప్రెషన్ లో ఉన్నారని అన్నారు.


విదేశాలకు వెళ్లి కేటీఆర్ చికిత్స చేయించుకొని ఇప్పుడు కేటీఆర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. డ్రగ్స్ కేసుపై దర్యాప్తు చేయకుండా ప్రభుత్వం ఎందుకు ఆపేసిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. దమ్ముంటే సిట్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఏం తప్పు లేకుంటే డ్రగ్స్ కేసును ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. 


సీఎం కేసీఆర్ కుటుంబం మొత్తానికి అహంకారం బాగా ఉందని బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ నేతల భాష చూసి జనం నవ్వుకుంటున్నారని చెప్పారు. వేములవాడ ఆలయం, ధర్మపురికి ఇస్తామన్న డబ్బులు ఏమయ్యాయని నిలదీశారు. తీగల గుట్టపల్లి ఆర్వోబీ నిర్లక్ష్యానికి కారణం ఎవరని ప్రశ్నించారు. గంగాధరకు ఆర్వోబీ మంజూరయ్యిందని, దీని పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు.


హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసుల్లో తాను ఎవరి పేరు చెప్పలేదని అన్నారు. కావాలనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను తంబాకు తింటున్నట్లు కేటీఆర్ ఆరోపణలు చేసినప్పుడు ఆయన సంస్కారం ఏమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తంబాకు తినడం చూశావా అంటూ ఎదురు ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇది సరైన పద్ధతి కాదని అన్నారు.