Mancherial Crime News: మంచిర్యాల జిల్లా గుడిపల్లిలో ఆరుగురిని సజీవ దహనం చేసిన కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు, హత్య చేసిన తీరును రామగుండం సీపీ చంద్రశేఖర్ వివరించారు. ఈ కేసులో నిందితులు అయిన లక్ష్మణ్, రమేష్, సమ్మయ్యలు మంచిర్యాల వైపు వెళ్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో మందమర్రి ఇన్ స్పెక్టర్ ప్రమోద్ కుమార్ సిబ్బందితో కలిసి వెళ్లి వారిని పట్టుకున్నారు. అలాగే ఈ ముగ్గురు నిందితులు ఇచ్చిన సమాచారంతో సృజన, అంజయ్యలను శ్రీరాంపూర్ వద్ద అరెస్ట్ చేశారు. 


అసలేం జరిగిందంటే..?


లక్షెట్టిపేటకు చెందిన మేడి లక్ష్మణ్ కు శ్రీరాంపూర్ కు చెందిన శాంతయ్య అలియాస్ శివయ్యతో స్నేహం ఏర్పడింది. శాంతయ్యకు సంబంధించిన భూములను.. లక్ష్మణ్ కొలవడం వల్ల 2010 నుంచి వాళ్ల కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధం ఏర్పడింది. అయితే శాంతయ్య భార్య సృజన అలియాస్ సుజన.. మేడి లక్ష్మణ్ వద్ద రెండు దఫాలుగా నాలుగు లక్షల రూపాయలను అప్పుగా తీసుకుంది. అయితే లక్ష్మణ్ తరుచుగా శ్రీరాంపూర్ కి వెళ్లి సుజనను డబ్బులు అడిగేవాడు. ఈ క్రమంలోనే వారి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. తరుచూ ఫోన్ లో మాట్లాడుకుంటూ నేరుగా సుజన ఇంట్లోనే వారిద్దరూ కలుసుకునేవారు. అంతకు ముందే శాంతయ్యకు గుడిపెల్లికి చెందిన మాసు రాజలక్ష్మీ అలియాల్ మాసు పద్మతో వివాహేతర సంబంధం ఉంది. దీంతో సుజన చాలా సార్లు భర్త శాంతయ్యతో గొడవ పడేది. ఈ క్రమంలోనే శాంతయ్య.. సుజన తల్లిదండ్రులు అర్నకొండ అంజయ్య, చంద్రమ్మలకు తన అక్రమ సంబంధం గురించి చెప్పాడు. నా జీతం డబ్బులతో సహా ఆస్తినంతా పద్మకే ఇచ్చేస్తానని అనేవాడు.


శాంతయ్యను చంపేస్తే భూమి రాసిస్తామంటూ ఆశ..


ఇదే విషయమై సుజన చాలా సార్లు పెద్దలతో పంచాయతీ పెట్టించింది. అయినప్పటికీ శాంతయ్యలో ఎలాంటి మార్పు లేదు. నేరుగా గుడిపెల్లిలో ఉంటున్న పద్మ ఇంటికే వెళ్లి అక్కడే ఉండిపోయాడు. ఉద్యోగానికి కూడా అక్కడి నుంచే వెళ్తూ.. సుజనను, వారి కుటుంబ సభ్యులను పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. ఈ క్రమంలోనే సుజన, ఆమె తల్లిదండ్రులు అతడిని హత్య చేయాలని భావించారు. సుజన ప్రియుడు అయిన మేడి లక్ష్మణ్ కు.. శాంతయ్యను చంపేస్తే సుజన కూతురు మౌనిక పేరిట ఉన్న మూడు గుంటల భూమిని రాసిస్తామని ఆశ చూపారు. అయితే శాంతయ్యను హత్య చేస్తే సుజనతో వివాహేతర సంబంధానికి ఏ అడ్డూ ఉండదని, శాంతయ్య సింగరేణి ఉద్యోగి కాబట్టి అతడు చనిపోతే వచ్చే డబ్బులతో తన అప్పు డబ్బులను వసూలు చేసుకోవచ్చని భావించి.. హత్య చేసేందుకు ఓకే చెప్పాడు. 


తన ఒక్కడితో కాదని శ్రీరాముల రమేష్ తో పన్నాగం..


శాంతయ్య గద్దేరాగడిలో ఉన్న తన ప్లాట్ ను సుజనకు తెలియకుండా అమ్ముకున్నాడు. దీంతో లక్ష్మణ్ లక్షెట్టిపేటలో ఒక అడ్వకేట్ ని మాట్లాడి రెండు ప్రైవేటు కేసులు వేయించాడు. అంటే శాంతయ్య అన్నాతమ్ముల మీద భూమి విషయంలో ఒకటి, తమ మెయింటనెన్స్ కు ఏమీ ఇవ్వట్లేదని.. సింగరేణిలో ఎలాంటి లావాదేవీలు జరగకుండా మరో కేసు పెట్టించాడు. అలాగే శాంతయ్యను చంపేందుకు అయ్యే ఖర్చుల కోసం.. సుజన కూతురు మౌనిక పేరు మీదు ఉట్కూరు ఎక్స్ రోడ్డులో ఉన్న మూడు గుంటల భూమి అమ్మమని లక్ష్మణ్ కు చెప్పారు. అయితే శాంతయ్యను చంపడం తన ఒక్కటి వల్ల కాదని భావించిన లక్ష్మణ్.. లక్షెట్టిపేటకు చెందిన శ్రీరాముల రమేష్ కు డబ్బు ఆశ చూపించాడు. శాంతయ్యను చంపితే నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని అన్నాడు. అప్పటికే పందుల వ్యాపారం చేసి నష్టాల్లో కూరుకుపోయిన రమేష్ ఇందుకు ఒప్పుకున్నాడు. శాంతయ్యను నెల రోజుల్లో యాక్సిడెంట్ చేసి చంపాలని ఒప్పందం కూడా చేసుకున్నారు. 


యాక్సిడెంట్ చేసి చంపాలని ప్లాన్ - కానీ అట్టర్ ప్లాప్


యాక్సిడెంట్ చేసేందుకు ఓ వాహనం కొనాలనుకున్నారు. ఈ క్రమంలోనే లక్షెట్టిపేటకు చెందిన కొమాకుల మహేష్ బొలెరో(AP01W9407 BOLERO MAX) వాహనాన్ని లక్షా 43 వేలకు మాట్లాడుకొని 43,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. బొలెరో వాహనాన్ని తీసుకొని వచ్చాడు. కానీ మహేష్ వద్ద బండి పేపర్స్ లేకపోవడంతో 40 వేల రూపాయలు ఖర్చు చేసి బ్రోకర్ ద్వారా పేపర్లు తయారు చేయించుకున్నారు. పేపర్లు లేకపోతే... శాంతయ్యను చంపేసిన తర్వాత ఎలాంటి బెనెఫిట్స్ రావని ఈ ప్లాన్ వేశారు. అయితే శాంతయ్య, మాసు పద్మల కదలికలను తెలుసుకునేందుకు.. లక్ష్మణ్, రమేష్ గుడిపెల్లికి వెళ్లారు. బెల్టు షాపులో మద్యం సేవిస్తూ వారి గురించి ఓ వ్యక్తిని అడిగారు. అయితే తనకు వారి గురించి తెలియదని.. సమ్మయ్య అనే ఓ వ్యక్తికి వారి గురించి బాగా తెలుసని ఓ వ్యక్తి చెప్పాడు. వెంటనే అతడి వద్ద నుంచి సమ్మయ్య ఫోన్ నెంబర్ తీసుకొని వారి కదలికల గురించి చెబితే లక్షన్నర రూపాయలు ఇస్తామని డీల్ మాట్లాడుకున్నారు. సమ్మయ్య కూడా వీరి డీల్ కు ఓకే చెప్పాడు. అలా శాంతయ్య, పద్మల కదలికలు తెలెసుకుంటూ హత్యకు పన్నాగం పన్నారు. 


పెట్రోల్ పోసి నిప్పంటించి చంపాలని మరో ప్లాన్..


పద్మ, శాంతయ్య మంచిర్యాలకు వెళ్లి వస్తున్న విషయాన్ని సమ్మయ్య ద్వారా తెలుకున్న రమేష్.. బొలెరో వాహనంతో వారు వస్తున్న ఆటోను ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఆటో తప్పించుకోగా.. బొలెరో వాహనం ముళ్ల పొదల్లో పడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో రమేష్ కు ఏమీ కాలేదు. ఆ తర్వాత మరోసారి కత్తులతో నరికి చంపాలని పన్నాగం పన్నారు. రామకృష్ణాపుర సంతలో రెండు కత్తులను కూడా కొనుగోలు చేశారు. కానీ ఇలా చేస్తే దొరికిపోతామని భావించి... ఆ కత్తులను లక్షెట్టిపేటలో దాచి పెట్టారు. ఆ తర్వాత బాగా ఆలోచించి పెట్రోల్ పోసి కాల్చి చంపాలని లక్ష్మణ్, రమేష్ లు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా సమ్మయ్యకు ఫోన్ చేసి ఇంట్లో ఎవరెవరు ఉన్నారని ప్రశ్నించగా.. శివయ్య, పద్మ, శాంతయ్యలు ఉన్నారని తెలిపాడు. ఈరోజే వాళ్లను చంపాలనుకొని రమేష్, లక్ష్మణ్ లు ఒక పెద్ద ప్లాస్టిక్ క్యాన్, ఖాళీ సంచితో పాటు కారం పొడి, రెండు అగ్గి పెట్టెలు కొనుగోలు చేశారు. 


12.30 గంటలకు పద్మ ఇంటికి నిప్పు పెట్టిన రమేష్, సమ్మయ్యలు..


ఆ తర్వాత వాళ్లకు తెలిసిన ఆటో డ్రైవర్ కు ఫోన్ చేసి మరో మూడు ప్లాస్టిక్ క్యాన్లు కావాలని అడిగారు. దీంతో ఓ వ్యక్తి వీరికి మూడు క్యాన్లు ఇచ్చాడు. రమేష్, లక్ష్మణ్ లు తమ వద్దనున్న 3 క్యాన్లలో 5 వేల రూపాయల పెట్రోల్ కొనుగోలు చేశారు. ఇంటిపై పోసేందుకు వీలుగా ఉండేలా మూడు క్యాన్లలోని ఒక దాని నుంచి నాలుగో క్యాన్ లో సగం పోశారు. అలాగే వాటర్ బాటిళ్లను సగానికి కట్ చేసుకొని దగ్గర పెట్టుకున్నారు. వీరికి సాయంగా సమ్మయ్య కూడా రంగంలోకి దిగాడు. ఆర్ధరాత్రి 12.30 గంటలకు రమేష్, సమ్మయ్యలు చెరి రెండు పెట్రోల్ క్యాన్లను తీసుకొని మాసు పద్మ ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్లారు. అయితే లక్ష్మణ్ మాత్రం ఆటోను తీసుకొని మంచిర్యాల వెళ్లిపోయాడు. ఫోన్ చేసి పద్మ ఇంటిని తుగలబెట్టమని చెప్పాడు. అయితే లక్ష్మణ్ ఆరోజు రాత్రి మంచిర్యాలలోని డీసెంట్ లాడ్జిలో రూం తీసుకున్నాడు. ఉదయం 7 గంటలు లక్షెట్టిపేటకు వెళ్లిపోయాడు. 


ముగ్గురు కాదు చనిపోయిందని ఆరుగురని తెలుసుకున్న లక్ష్మణ్..


ఆ తర్వాత రమేష్, సమ్మయ్యలు కలిపి ఇంటికి నిప్పు పెట్టారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకుని ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. మృతి చెందిన వారిలో మాసు శివయ్య (50),  పద్మ (శివయ్య భార్య) (40),  మౌనిక (35), హిమ బిందు (2),  స్వీటీ (4),  శాంతయ్య (40) (సింగరేణి కార్మికుడు)గా గుర్తించారు. ముగ్గురే ఉన్నారనుకొని ఇంటికి నిప్పు పెట్టగా ఆరుగురు ఉన్నట్లు రమేష్, సమ్మయ్యలకు పొద్దున తెలిసింది. వెంటనే వారు ఈ విషయాన్ని లక్ష్మణ్ కు తెలిపాడు. అప్పటి నుంచి వారు భయంతో ఇళ్లకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. పోలీసులు కూడా వీరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈరోజు లక్ష్మణ్, రమేష్, సమ్మయ్యలు మంచిర్యాల ఓవర్ బ్రిడ్జ్ వద్ద కలిసుకున్నారు. ఎటైనా పారిపోవాలని అనుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత నిందితుల సమాచారం మేరకు సుజన, ఆమె తండ్రి అంజయ్యలను శ్రీరాంపూర్ వెళ్లి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.