రోజు రాత్రి గోరువెచ్చని పాలు తాగి పడుకుంటే హాయిగా నిద్ర పడుతుందని కొందరి వాదన. కానీ రాత్రిపూట పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదనేది వైద్య నిపుణుల అభిప్రాయం. ఇది బరువు పెరగడానికి, ఆరోగ్యం మందగించడానికి కారణం అవుతుందని అంటున్నారు. ఎందుకు అలా? అనేది తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే..


పాలు తాగడం మంచిదేనా?


చాలా మంది నిద్రవేళకి ముందు ఒక గ్లాసు వెచ్చని పాలు తాగడం అలవాటు. ఇది నిద్రని ప్రేరేపిస్తుందని, జీవక్రియని మెరుగుపరుస్తుందని అంటారు. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న వాదన. కానీ ఇది నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని, బరువు పెరగడానికి దారి తీస్తుందని నిపుణులు విశ్వసిస్తున్నారు.


మలబద్ధకం


నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రిపూట చల్లని పాలు తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అప్పటికే కడుపు నిండా భోజనం చేసి ఉంటారు. తర్వాత పాలు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఫలితంగా మలబద్ధకం ఏర్పడవచ్చు.


బరువు పెరుగుతారు


రాత్రిపూట పాలు తాగడం వల్ల ప్రోటీన్, పాల కొవ్వులు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. కాబట్టి బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక గ్లాసు పాలలో దాదాపు 120 కేలరీలు ఉంటాయి. రాత్రిపూట పాలు తాగొద్దు అనేందుకు ఇది ప్రధాన కారణం. ఎందుకంటే కేలరీలు సులభంగా కరిగిపోవు. బరువును పెంచుతాయి.


జీర్ణక్రియని ఎలా ప్రభావితం చేస్తుంది?


నిపుణులు అభిప్రాయం ప్రకారం పాలు తాగడం వల్ల కలిగే పరిణామాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. ఎవరైనా లాక్టోస్ తక్కువగా ఉన్నప్పుడు పాలు తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాలని కలిగిస్తుంది. ఇది జీవక్రియకి ఇబ్బంది కలిగిస్తుంది. ఫలితంగా అతిసారం, కడుపులో నొప్పి వస్తాయి. దాని వల్ల నిద్ర ప్రభావితం అవుతుంది. నిద్రలేమి సమస్య ఏర్పడవచ్చు.


జీవక్రియ నెమ్మదిస్తుంది


రాత్రిపూట పాలు తాగడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మందగిస్తుంది. కాలేయ పనితీరుని ప్రభావితం చేస్తుంది. ఇది జీవక్రియ రేటుని మరింత పెంచుతుంది. కొవ్వు నిల్వ చెయ్యడం వల్ల బరువు పెరగడానికి దారితీస్తుంది.


కానీ పాలు ఆరోగ్యానికి మంచిది. రాత్రి పూట కంటే పగటి వేళ పాలు తాగడం మంచిది. వీటిలో ఉండే కాల్షియం ఎముకలు ధృడంగా అయ్యేలా చేస్తుంది.


పాల వల్ల లాభాలు
రోజులో పావు లీటరు పాలు తాగితే అందులో 8 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఒక్క ఆ కొవ్వు గురించి ఆలోచించి పాలు తాగడం మానేయద్దు. శరీరానికి రోజువారీ అవసరాలకి కావాల్సిన ఇతర పోషకాలు కూడా పాలలో పుష్కలంగా ఉన్నాయి. పాలల్లో ఉండే కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తాయి. దీనివల్ల వయసు ముదిరాక బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది. విటమిన్ ఎ, విటమిన్ బి12, పొటాషియం, మెగ్నీషియం, జింక్, అయోడిన్ వంటివి లభిస్తాయి.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఈ టిప్స్ పాటించారంటే రెస్టారెంట్లో అతిగా తినరు - బరువు పెరుగుతారనే భయం ఉండదు