Viral News: గుండ్రాయిలా ఉన్న మనుషులు హఠాత్తుగా చనిపోతున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. స్టేజీపై నృత్యం చేస్తోన్న ఓ వ్యక్తి హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రిగా తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ జరిగింది
జమ్మూలోని బిష్నా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సాంస్కృతి క కార్యక్రమంలో యోగేశ్ గుప్తా (20) అనే కళాకారుడు పార్వతీదేవి వేషధారణలో నృత్యం చేశాడు. కాసేపు నృత్యం చేసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
అయితే అక్కడున్న వారంతా నృత్యం చేస్తున్నాడని భావించి అతని వద్దకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. కొద్ది క్షణాలైన లేవకపోయేసరికి.. శివుడి వేషధారణలో ఉన్న మరో వ్యక్తి యోగేశ్‌ను లేపేందుకు వెళ్లాడు. అయితే ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో అతడ్ని ఆసుపత్రికి తరలించారు.
గుండెపోటు కారణంగా యోగేశ్ అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరో ఘటన
ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్ బరేలీలో ఇలాంటి తరహా ఘటనే జరిగింది. స్నేహితుడి బర్త్‌డే పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తి హుషారుగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న ఓ వైద్యుడు అతనికి సీపీఆర్ చేసినా ఫలితం లేకుండాపోయింది.
ఇదే కారణమా?
పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చిన్నవయసులోనే గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఫలితంగా గుప్పెడు గుండె కొట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ, ఆగే పరిస్థితులు తెచ్చుకుంటోందని వైద్యులు చెబుతున్నారు. తీవ్రంగా హార్ట్ ఎటాక్ వచ్చి సెకన్లలో గుండె ఆగిపోతే, సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం ఉండదు కానీ, కొందరిలో మైల్డ్ గా, లేదా మధ్యస్థ స్థాయిలో హార్ట్ ఎటాక్ వస్తుంది. అలాంటప్పుడు సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
Also Read: Vietnam Fire Accident: బార్‌లో చెలరేగిన మంటలు- 33 మంది సజీవదహనం!
Also Read: Viral Video: ఇదేం గోకుడు సామీ! తుక్కుతుక్కు చేసేశావ్ కదా గణేశా!