Bengaluru Man Fined For Not Wearing Helmet:


చలానాపై సవాల్ 


ట్రాఫిక్ పోలీసులు చలానాలు వేయడం, వాటిపై గొడవలు అవడం చాలా సాధారణమైపోయింది. రోడ్డుమీదే పోలీసులకు, వాహనదారులకు వాగ్వాదం జరిగిన సందర్భాలూ ఉన్నాయి. బెంగళూరులో ఇలాంటిదే జరిగింది. హెల్మెట్ లేదని ట్రాఫిక్ పోలీసులు చలానా పంపితే..."అది నేనే అని నిరూపించండి" అని సవాల్‌ చేశాడు ఓ యువకుడు. నిముషాల్లోనే పోలీసులు ఇచ్చిన రెస్పాన్స్‌తో ఆ యువకుడికి మైండ్ బ్లాంక్అయింది. 


ఏం జరిగిందంటే..


బెంగళూరులో ఫెలిక్స్ రాజ్ అనే ఓ బైకర్ హెల్మెట్ ధరించలేదని ట్రాఫిక్ పోలీసులు ఫోటో తీసి చలానా పంపారు. ఈ చలానా చూసి అసహనానికి గురైన బైకర్..పోలీసులకు గట్టి షాక్ ఇవ్వాలనుకున్నాడు. ట్విటర్‌లో చలానా షేర్ చేశాడు. "ఈ ఫోటోలో నా బైక్ ప్లేట్ నంబర్ మాత్రమే కనిపిస్తోందని, అలాంటప్పుడు నేను హెల్మెట్ పెట్టుకోలేదని మీరెలా డిసైడ్ చేస్తారు" అని ప్రశ్నించాడు. "క్లియర్ ఇమేజ్ షేర్ చేయండి, లేదంటే మొత్తానికి చలానానే క్యాన్సిల్ చేయండి. గతంలోనూ ఇలానే జరిగింది. అయినా నేను చలానా కట్టాను. ఈ సారి కూడా అలానే కట్టలేను" అని ట్వీట్ చేశాడు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను ఈ పోస్ట్‌లో ట్యాగ్ చేశాడు. ఇది చూసిన ట్రాఫిక్ పోలీసులు...కొన్ని నిముషాల్లోనే ఆ యువకుడి ఫోటోతో సహా మరో ట్వీట్ చేశారు. అందులో అతని ముఖం స్పష్టంగా కనబడుతోంది. ఇది చూసి షాకైన యువకుడు వెంటనే తప్పు దిద్దుకున్నాడు. "ఫోటోని షేర్ చేసినందుకు ధన్యవాదాలు. ఓ సామాన్య  పౌరుడిగా ఈ ప్రశ్న అడిగే హక్కు నాకు ఉంది. క్లారిటీ ఇచ్చిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులకు అభినందనలు. చలానా కట్టేస్తాను" అని రిప్లై ఇచ్చాడు. ఇదంతా చూశాక నెటిజన్స్ ఊరుకుంటారా..? ట్రాఫిక్ పోలీసులను ప్రశ్నించిన ఆ యువకుడిని ఓ ఆట ఆడుకుంటున్నారు. రకరకాల కామెంట్లు పెడుతున్నారు.