Fight For Rasgullas In Wedding: పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో వేడుక లాంటిది. విందు, వినోదంతో జీవితాంతం గుర్తుండి పోయే సంబరం. ఇంటికి వచ్చిన బంధువులు చుట్టాలతో అంతా సందడిగా మారుతుంది. వచ్చిన చుట్టాలకు మర్యాదలు తక్కువ అయితే వచ్చే మాటలు అన్నీ ఇన్నీ కాదు. అందుకే పెళ్లికి వచ్చిన వారితో చాలా మర్యాదగా, జాగ్రత్తగా మసులుకుంటారు. అంతే కాదు వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటారు. వారికి కావాల్సినవి సమకూరుస్తూ ఉంటారు. ప్రత్యేక వంటలు చేయిస్తూ ఏ లోటు రాకుండా చూసుకుంటారు. 


ఒక్కోసారి పెండ్లి వేడుక‌లో ఊహించిన‌దానికంటే ఎక్కువ‌గా బంధువులు, ఇత‌రులు వేడుక‌కు ఎక్కువ వస్తే ఇబ్బందులు తప్పవు. ఆహారం విష‌యంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఆ సమయంలో మాట‌ల యుద్ధాలు జరుగుతాయి. శుభ‌కార్యం కావ‌డంతో కొట్లాట‌లు, పంచాయ‌తీలు వ‌ద్దని కొందరు స‌ర్ధుకుపోతారు. కానీ మరి కొందరు మాత్రం రచ్చ లేపుతారు. తమకు అది తక్కువైంది, ఇది ఎక్కువైంది అంటూ నానా హంగామా చేస్తారు. ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌ (Uttar Pradesh)లో జరిగింది. ఓ పెళ్లి వేడుక‌లో రసగుల్లా(Rasgulla) తక్కువ వచ్చిందని పెళ్లికి వచ్చిన వారు చిత‌కొట్టుకున్నారు. క‌ర్రల‌తో ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకున్నారు. 


వివరాలు.. ఉత్తర‌ప్రదేశ్ (Uttar Pradesh) ఆగ్రా (Agra)లో షాకింగ్ ఘటన జరిగింది. శంషాబాద్ (Shamshabad) పట్టణంలోని నయావాస్ రోడ్డులోని బ్రిజ్భాన్ కుష్వాహా ఇంట్లో వివాహ వేడుక (Wedding) జరిగింది. పెద్ద సంఖ్యలో బంధువులు, చుట్టాలు వచ్చారు. వారిలో మనోజ్ కుమారుడు గౌరీశంకర్ శర్మ మరో ముగ్గురితో కలిసి భోజనాల వద్దకు వెళ్లారు. ఆ సమయంలో రసగుల్లా (Rasgulla) తినడంపై వాగ్వాదం జరిగింది. ఘ‌ర్షణ‌కు దారితీసింది. ఈ క్రమంలోనే బందువులు రెండు వర్గాలుగా విడిపోయి క‌ర్రలతో దాడి చేసుకున్నారు.


ఆరుగురికి తీవ్ర గాయాలు 
ఈ ఘటనలో బ్రిజ్భన్ సింగ్ భార్య భగవాన్ దేవి, బ్రిజ్భన్ సింగ్ కుమారుడు యోగేష్ గాయపడ్డారు. మరోవైపు మనోజ్, కైలాష్ కుమారులు గౌరీ శంకర్ శర్మ, ధర్మేంద్ర కుమారుడు రమేష్ శర్మ, పవన్ కుమారుడు గౌరీ శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ రక్తసిక్త ఘర్షణ గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  వివాదానికి గల కారణాలు తెలుసుకుని అవాక్కయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


పోలీసులు ఏమన్నారంటే
శంషాబాద్ పోలీస్ స్టేషన్ చీఫ్ అనిల్ శర్మ వివరాల ప్రకారం.. విందులో రసగుల్లా తినే విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో ఒక‌రిపై ఒక‌రు తీవ్రంగా దాడి చేసుకున్నారు. గాయ‌ప‌డిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ర్షణ గురించి ఫిర్యాదు అందిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని అనిల్ శర్మ తెలిపారు. 


గత ఏడాది ఇలాంటి ఘటనే..
ఉత్తర్‌ప్రదేశ్‌లో గత ఏడాది ఇలాంటి ఘటనే జరిగింది. ఆగ్రా జిల్లా ఎత్మాద్‌పూర్‌ పట్టణంలోని మొహల్లా షాయిఖాన్‌ ప్రాంతానికి చెందిన ఉస్మాన్‌ కుమార్తె పెళ్లి వేడుక జరిగింది. వివాహ వేడుకలో రసగుల్లా తక్కువ అయ్యాయి. దీంతో వధువు, వరుడు తరఫు బంధువులు రసగుల్లా కోసం గొడవకు దిగారు. స్వీట్స్ తమకు అందలేదని పెళ్లికూతురు తరపు వారితో వరుడు తరపు బంధువులు గొడవకు దిగారు. ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో 22ఏళ్ల సన్నీతో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన సన్నీ (22)ని ఆగ్రాలోని సరోజినీ నాయుడు మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు.