Vehicle Prices: 


కొత్త నిబంధనలతో ధరలకు రెక్కలు..


వ్యక్తిగత, వాణిజ్య వాహనాల ధరలకు రెక్కలు రానున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం వాటిని తయారు చేయాల్సి రావటం వల్ల ఉత్పత్తి వ్యయం పెరగనుంది. అందుకే...ఆ మేరకు సంస్థలు ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశముంది. ప్రస్తుతానికి అన్ని సంస్థలూ భారత్ స్టేజ్ VI (BS-6) ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలు తయారు చేస్తున్నాయి. ఈ వాహనాల నుంచి తక్కువ మోతాదులో కర్బన ఉద్గారాలు వెలువడుతాయి. ఈ ప్రమాణాలకు తగ్గట్టుగా వాహనాలు ఉండాలంటే...కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. వాహనాలకు ఓ ప్రత్యేక డివైజ్‌ను అమర్చనున్నారు. ఏ మేర కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయో లెక్కించే పరికరం ఇది. కాటలిటిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్స్‌ను ఈ పరికరం నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. 
నిబంధనలు అనుగుణంగానే కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయా లేదా అని పరిశీలిస్తుంది. ఒకవేళ నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువగా కాలుష్యం నమోదైతే..వెంటనే ఆ పరికరం అలెర్ట్ చేస్తుంది. వాహనదారులు అప్రమత్తమై వెహికిల్‌ని సర్వీసింగ్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డివైజ్‌తో పాటు ప్రోగ్రామ్డ్‌ ఫ్యూయెల్ ఇంజెక్టర్స్‌ కూడా వాహనంలో అమర్చుతారు. పెట్రోల్ ఇంజిన్‌లో ఫ్యూయెల్ ఎంత ఇంజెక్ట్ అవుతుందో కనిపెడుతుందీ పరికరం. అంతే కాదు. వాహనాల్లో అమర్చే సెమీకండక్టర్లనూ అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మార్పులన్నీ చేయాలంటే తప్పకుండా ఎక్కువ ఖర్చు పెట్టక తప్పదు. అందుకే వాహనాల ధరలు పెరగనున్నాయి. 


ఎయిర్ బ్యాగ్స్‌తోనూ వ్యయం..


ప్యాసింజర్ కార్స్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్‌ తప్పనిసరిగా ఉండాల్సిందేనని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తేల్చి చెప్పారు. "ఎంత విలువైన కార్‌లో ప్రయాణిస్తున్నారనేది పక్కన పెట్టేసి...ప్రతి ప్రయాణికుడి ప్రాణానికి భద్రత ఉండేలా చూడాల్సిందే" అని ట్వీట్ చేశారు గడ్కరీ. ఇందుకు సంబంధించిన డ్రాప్ట్ నోటిఫికేషన్‌ను ఇప్పటికే
కేంద్రం ఈ ఏడాది జనవరిలోనే విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచే...8 సీట్లున్న M1 కేటగిరీ కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండేలా తయారు చేయాలని స్పష్టం చేసింది. అయితే...ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కారణంగా...ఆటోమొబైల్ ఇండస్ట్రీ కాస్త కుదేలైంది. మునుపటిలా స్పేర్ పార్ట్స్‌ దొరకటం లేదు. కార్ల తయారీ కూడా కాస్త మెల్లగా సాగుతోంది. డిమాండ్ పెరుగుతున్నా..అందుకు తగ్గట్టుగా సప్లై ఉండట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి ప్యాసింజర్ కార్లలో తప్పనిసరిగా 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది కేంద్రం. ఇదే విషయాన్ని నితిన్ గడ్కరీ కూడా వివరించారు. "సప్లై చెయిన్‌లో సమస్యల కారణంగా...ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అందుకే..6 ఎయిర్ బ్యాగ్స్ ఉండాలన్న నిబంధనను వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని నిర్ణయించాం" అని ట్వీట్ చేశారు.  ఈ నిబంధన బాగానే ఉన్నా...వినియోగదారులపై భారం పడక తప్పదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే కార్ల ధరలు ప్రియమైపోయాయి. తయారీ ధరలు పెరగటం వల్ల ఈ మధ్య కాలంలో కార్ల ధరలు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి చేస్తే ఆ మేరకు కాస్ట్ పెరుగుతుంది.