Uniform Civil Code in Uttarakhand: ఉత్తరాఖండ్ ప్రభుత్వం యునిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి తీసుకొచ్చింది. మార్చి 13వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. UCC అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ చరిత్ర సృష్టించింది. గత నెలలో అసెంబ్లీలో ఈ బిల్ పాస్ అయింది. ఇప్పుడు ఆ బిల్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఫలితంగా ఇది చట్టరూపం దాల్చింది. ఫిబ్రవరి 7వ తేదీన వాయిస్ ఓట్ ద్వారా అసెంబ్లీలో పాస్ అయింది ఈ బిల్లు. దాదాపు రెండు రోజుల పాటు దీనిపై వాదోపవాదాలు జరిగాయి. అసెంబ్లీ సెలెక్ట్ కమిటీకి ఈ బిల్‌ని పంపించాలని, ఆ తరవాతే ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కానీ...పుష్కర్ సింగ్ ధామి సర్కార్ నేరుగా ప్రవేశపెట్టింది.
ఈ చట్టం ప్రకారం లివిన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్లు కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్లు రాష్ట్రంలో ఉన్నా వేరే ప్రాంతంలో ఉన్నా సరే ఉత్తరాఖండ్ వాళ్లయితే తప్పనిసరిగా ఈ నిబంధనను పాటించాలి. సహజీవనం చేసిన వాళ్లకి పుట్టిన పిల్లలను సక్రమ సంతానంగానే పరిగణిస్తారు. కొన్నాళ్లు సహజీవనం చేసి ఆ తరవాత మహిళను దూరం పెడితే కచ్చితంగా వాళ్లకు భరణం ఇవ్వాల్సి ఉంటుందని ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. లివిన్ రిలేషన్‌షిప్స్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే 6 నెలల జైలు శిక్ష విధించేలా కఠిన నిబంధన చేర్చారు. ఇక భర్త అత్యాచారం చేసినా, లేదంటే అసహజ శృంగారానికి పాల్పడాలని ఒత్తిడి తెచ్చినా, ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్నా విడాకులు ఇచ్చే హక్కులు భార్యకి కల్పించనుంది ఈ చట్టం. బహుభార్యత్వంతో పాటు హలాలా సంప్రదాయాన్నీ ఈ చట్టం నిషేధించనుంది. కొన్ని ముస్లిం వర్గాలు ఇప్పటికీ ఈ సంప్రదాయాల్ని పాటిస్తున్నాయి. దీని కారణంగా మహిళలకు అన్యాయం జరుగుతోందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భావించింది. అందుకే వాటిపై నిషేధం విధిస్తున్నట్టు స్పష్టం చేసింది. అయితే...ఈ చట్టం గిరిజన వర్గాలకు మాత్రం వర్తించదని తెలిపింది. వాళ్ల ఆచారాలను, సంప్రదాయాలను కాదనే అధికారం లేదని వివరించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూసీసీ అమలుకు ఇప్పటికే చర్చ జరుగుతోంది. గుజరాత్, అసోంలోనూ UCC అమలు చేసే అవకాశాలున్నాయి.
అసోం ప్రభుత్వం రూపొందించిన UCC బిల్లు.. తీవ్రస్థాయిలో దుమారం రేపేలా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఈ ముసాయిదా బిల్లుపై ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నా యి. కీలకమైన ముస్లిం మైనారిటీ వర్గాల వివాహాలు, విడాకుల రిజిస్ట్రేషన్ చట్టాన్ని రద్దు చేస్తున్నారు. దీంతో పాటు ఇతర మైనారిటీ వర్గాలకు కూడా.. ఈ బిల్లులో షాక్ ఇచ్చే నిర్ణయాలే ఉండడం గమనార్హం. దీంతో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ.. అసోంలో మైనారిటీ వర్గాలు ఆందోళన చేపడుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా.. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలు, అసోం నేషనల్ ఫ్రంట్ పార్టీ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి.