Andhra Pradesh Elections 2024: ఈనెల 16న వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థుల జాబితాను ఇడుపులపాయలో జగన్ ప్రకటించనున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఫైనల్‌ జాబితా సిద్ధమైపోయింది. దీన్ని ఆ పార్టీ అధినేత జగన్ ఈ నెల 16వ తేదీన ప్రకటించనున్నారు. ఇడుపులపాయ వేదికగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్నారు. 


వివిధ దఫాలుగా ఇన్‌ఛార్జ్‌లను మార్చిన వైసీపీ అధినేత జగన్‌ ఇక ఫైనల్‌ లిస్ట్‌ను ప్రిపేర్ చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అనూహ్యంగా కొత్త పేర్లను తెరపైకి తీసుకొచ్చి జగన్ చాలా మంది సిట్టింగ్‌లను తప్పించారు. ఫైనల్ లిస్ట్‌లో ఇలాంటి మార్పులు చాలానే ఉంటాయని అంటున్నారు.


ఈ లిస్ట్‌తోపాటు మ్యానిఫెస్టో కూడా విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతోంది. సిద్ధం సభ వేదికగానే మ్యానిఫెస్టో విడుదల చేయాలని భావించారు. ఎందుకో కానీ అది జరగలేదు. ఇప్పుడు ఇడుపులపాయ వేదికగా అది జరుగుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు దీనిపై వైసీపీ లీడర్లు ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. 


12 దఫాలుగా ఇన్‌ఛార్జ్‌ల లిస్ట్‌లు విడుల చేసిన వైసీపీ 70కి పైగా స్థానాల్లో అభ్యర్థలను మారుస్తూ వచ్చింది. ఈ పన్నెండు జాబితాల్లో మొదటిసారి ఇచ్చిన తర్వాత మళ్లీ వారి స్థానంలో వేరే వాళ్లకు చోటు కల్పించింది. చివరి వరకు ఎవరూ కన్ఫామ్‌ కాదని అధినాయకత్వం చెబుతూనే వస్తోంది. ఇప్పటి వరకు 76 స్థానాల్లో ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. 24 ఎంపీ స్థానాల్లో అభ్యర్థలను ఖరారు చేశారు.