Telugu Desam News: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) చేపట్టిన శంఖారావంలో సరికొత్త వ్యూహాన్ని అమలు చేసినట్టు టిడిపి సీనియర్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల్లో అసంతృప్తులను ఏకతాటిపైకి తెచ్చే విధంగా నారా లోకేష్ ప్రయత్నాలు చేసినట్టు చెబుతున్నారు. ఎన్నికల శంఖారావం(Shankharavam) పేరుతో ఇప్పటికే నారా లోకేష్ జిల్లాల వారీగా సభలను ఏర్పాటు చేస్తూ కార్యకర్తలలో జోష్ నింపారు. ఇది కేవలం ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పెడుతున్న సభలు మాత్రమే కాదు.. పార్టీలో ఉన్న అసంతృప్తులను ఏకం చేసేందుకు వేదికగా కూడా మారిందని టిడిపి నేతల పేర్కొంటున్నారు. 


అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం 


ఉమ్మడి అనంతపురం(Anantapuram) జిల్లాలో అభ్యర్థుల ప్రకటన అనంతరం తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు కనిపించాయి. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లను కాదని కొత్తవారికి అవకాశం కల్పించారు. ఆ స్థానంలో ఉన్న సిట్టింగ్‌లు వారి కేడర్‌లో తీవ్ర అసహనంతోపాటు ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. వారందరినీ ఎన్నికల శంఖారావం పేరుతో ఆ నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటిస్తూ.. వారందరినీ ఏకతాటిపైకి తెచ్చే విధంగా చర్చలు జరిపినట్టు సమాచారం. 


నేతలతో సమావేశాలు -కేడర్‌కు దిశానిర్దేశం 


ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెనుగొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే  బికె పార్థసారథి(BK Partha Sarathi)ని కాదని మహిళా ప్రధాన కార్యదర్శి అయిన సవితమ్మ(Savitamma)కు టికెట్ కేటాయించారు. దీనిపై సీనియర్ నేత బి కే పార్థసారథి వర్గం అసహనం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి(Hanumanta Chowdary)ని, కళ్యాణదుర్గం ఇన్చార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు(Uma Maheswar Naidu)నీ కాదని కొత్త అభ్యర్థి అయిన అమిలినేని సురేంద్రబాబు(Amilineni Surender Babu)కు టికెట్ కేటాయించడంపై ఆ నియోజకవర్గంలో ఇద్దరు నేతలు భగ్గుమన్నారు. సింగనమల నియోజకవర్గంలో టూ మెన్ కమిటీ చెప్పిన వారికి కాదని 2019లో పోటీ చేసిన బండారు శ్రావణి(Bandaru Sravani)కి మరోసారి తెలుగుదేశం టికెట్ కేటాయించడంపై నేతలు బహిరంగంగానే విమర్శించారు. మడకశిర నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్‌కు టికెట్ కేటాయించడంపై మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కార్యకర్తల ఫిర్యాదుల స్వీకరణ


ఇలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు కొత్తవారికి అవకాశం కల్పించడం వాటిపై ఉన్న అసంతృప్తులను ఏకం చేసే దిశగా లోకేష్ అంతర్గతంగా నేతలతోనూ నియోజకవర్గంలో ఉన్న మండల స్థాయి లీడర్లతో ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకొని చర్చించినట్లు సమాచారం. వీరందరిని ఏకతాటిపైకి తెచ్చి వచ్చే ఎన్నికల్లో పార్టీ కోసం పని చేయాలని నారా లోకేష్ ఆదేశించారు. ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ఎంత మద్దతు ఉందో అంచనా వేసే పనిలో కూడా లోకేష్ క్యాడర్ నిమగ్నమైంది. కొన్ని నియోజకవర్గాల్లో నాయకులపై కార్యకర్తల ఫిర్యాదులు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటిని సర్దుబాటు చేయాలని జిల్లా పెద్దలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.