Uttar Pradesh News: ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh)లో దారుణం జరిగింది. అంబేడ్కర్ నగర్ జిల్లాలో మహిళలపై పోలీసులు విచక్షణా రహితంగా దాడి చేశారు. లాఠీలు, పైపులతో మహిళలపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
అంబేడ్కర్‌నగర్ జిల్లా జలాల్‌పుర్‌లో ఈ ఘటన జరిగింది. జలాల్‌పుర్‌లో ఈ మధ్య బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రాంతం తమదంటూ అంబేడ్కర్ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు.
దీంతో స్థానిక ప్రజలు విగ్రహ ధ్వంసానికి వ్యతిరేకంగా వివాదాస్పద ప్రాంతంలో నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరసనకారులపై లాఠీలు, పైపులతో విచక్షణా రహితంగా దాడి చేశారు.
ఓ మహిళను తలపై కొట్టడంతో ఆమె అక్కడే పడిపోయింది. అయితే మహిళలు తమపై ఇటుకలతో దాడిచేశారని, మహిళా అధికారిని జుట్టు పట్టుకుని కొట్టారని పోలీసులు ఆరోపిస్తున్నారు. అందుకే తాము లాఠీలకు పనిచెప్పామన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోలో మహిళలపై పోలీసులు దాడి చేస్తున్నట్లు క్లియర్‌గా ఉంది. ఓ మహిళపై ముగ్గురు పోలీసులు లాఠీలు, పైపులతో దాడి చేస్తున్నారు.
విమర్శలు
మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు.. రౌడీల్లా వ్యవహరించారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.