నిత్యకృత్యమైన పనుల్లో దంత దావనం.. అదేనండి పళ్లు తోముకోవడం ఒకటి. పొద్దున్న లేవగానే చాలా మంది చేసే పని. అయితే కొందరు పొద్దున్నే బెడ్ టీ లేదా బెడ్ కాఫీ తాగిన తర్వాత పళ్లు తోముకుంటూ ఉంటారు. మరి కొందరు ఏకంగా బ్రేక్ ఫాస్ట్ తర్వాతే పళ్ల తోముకుంటారు. ఇందులో ఏ పద్ధతి మంచిదో, నిపుణులు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం.


సాధారణంగా పొద్దున్నే నిద్ర లేచే వారికి పళ్లు తోముకున్న తర్వాతే ఇతర పనులు చేసుకోవడం అలవాటు ఉంటుంది. కానీ కొందరు పొద్దుపొయ్యే వరకు పడుకుంటారు. అలాంటి వారు నిద్ర లేవడమే ఆకలితో లేస్తుంటారు. ఇలాంటి వారికి బ్రేక్ ఫాస్ట్ తర్వాత పళ్లు తోముకునే అలవాటు ఉంటుంది. ఇంకొందరు స్నానంతో పాటే పళ్లు తోమే పని చేద్దాంలే అనుకుంటారు. కానీ అలా రోజు మొదలు పెట్టడం ఎంత వరకు సబబు? బ్రేక్ఫాస్ట్ కి ముందు పళ్లు తోముకోవడం కరెక్టా? లేక తర్వాత? దీనిపై నిపుణులు ఏమన్నారంటే...


పళ్లు ఎందుకు తోమాలి?


మన నోటిలో ప్రతి రోజు తయారయ్యే ప్లేక్‌ను తొలగించడం చాలా అవసరం. ప్లేక్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటే ఫిల్మ్ లాంటి పదార్థం దంతాల మీద పేరుకుంటుంది. మనం తీసుకున్న ఆహార కణాలు పళ్ల సందులు, చిగుళ్ల మధ్య చిక్కుకున్నందు వల్ల నోటిలోనే పుడుతుంది. జీర్ణవ్యవస్థ తర్వాత నోటిలోనే ఎక్కువ సూక్ష్మ క్రిములు ఉంటాయి. నోటిలోని రెసిడ్యూతో కలిసి పాథోజెనిక్ బ్యాక్టీరియా తయారవుతుంది. దీని వల్ల చిగుళ్ల వ్యాధులు, దంతక్షయం, పిప్పళ్లు, చిగుళ్ల నుంచి రక్తం రావడం వంటి అనేకానేక సమస్యలు వస్తాయి. ప్లేక్ లేయర్ తయారు కావడానికి 12 గంటల సమయం పడుతుంది. 12 గంటల్లోపూ దీన్ని నోటి నుంచి పారద్రోలక పోతే ఇది దంతాలకు అంటుకుపోతుంది. అందుకే 12 గంటల వ్యవధిలోపే ఒకసారి బ్రష్ చేసుకోవడం అవసరమని దంత నిపుణులు సూచిస్తున్నారు.


వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలను అనుసరించి.. రోజులో రెండు సార్లు తప్పకుండా బ్రష్ చేసుకోవాలి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒక సారి తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్‌కు ముందే బ్రష్ చేసుకోవడం ఆరోగ్యకరమైన అలవాటు. ఎందుకంటే తినడానికి ముందే నోటి నుంచి బ్యాక్టీరియా తొలగించడం దంతాలకు నష్టం వాటిల్లకుండా కాపాడుకోవచ్చు. నోటిలో ప్లేక్ పేరుకుని ఉండగా ఆహారం తీసుకోవడం వల్ల బ్యాక్టిరియా ఈ ఆహారంతో కలిసి త్వరగా తమ సంఖ్యను రెట్టింపు చేసుకుంటాయి. అంటే రెట్టింపు ప్లేక్ రెట్టింపు నష్టం. ముఖ్యంగా రోజుకు ఒకేసారి సారి బ్రష్ చేసుకునే అలవాటున్న వారికి ఇలాంటి అలవాటు అసలు ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


రాత్రి తీసుకున్న భోజనం తాలుకు అన్న కణాలతో కలిసి చాలా ఎక్కువ మొత్తంలో ప్లేక్ నోట్లో పేరుకొని ఉంటుంది. అది తొలగించకుండానే ఆహారం తీసుకుంటే బ్యాక్టీరియాకి ఆహారం అంది, అది త్వరగా రెట్టింపు అవుతుంది. అందువల్ల దంత క్షయం అవుతుంది. బ్యాక్టీరియా లేని లేదా తక్కువగా ఉన్న నోటితో బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం ఎంతైనా మంచిదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా తప్పనిసరిగా బ్రష్ చేసుకున్న తర్వాతే ఏదైనా తినడం తాగడం మంచిదని అంటున్నారు. 


Also read: బ్యూటీ పార్లర్‌కు వెళుతున్నారా? ‘బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్’ గురించి తెలుసుకుని వెళ్లండి




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.