Uttar Pradesh Band Baja: 


లోకల్ పోలీస్‌ల అనుమతి తీసుకోవాల్సిందే..


బ్యాండ్ బాజా లేకుండా పెళ్లి తంతు పూర్తి కాదు. బరాత్ లేకపోతే అసలు అది పెళ్లే కాదు అని ఫిక్స్ అయిపోతారంతా. అసలు పెళ్లిలో ఉండే మజానే...ఈ బ్యాండ్ బాజాతో  వస్తుంది. అయితే...కొన్ని చోట్ల ఈ బాజా కాస్త శృతి మించుతోంది. రాత్రి 11 దాటినా పెద్ద మోతలతో చుట్టు పక్కల ఉన్న వాళ్లను ఇబ్బంది పెడుతుంటారు చాలా మంది. ఇక డీజేల సంగతి సరే సరి. వాడవాడ మొత్తం మోగిపోయేలా సౌండ్ పెట్టేస్తారు. డ్యాన్స్ చేసే వాళ్లకు ఇది బాగానే అనిపించినా...స్థానికులకు మాత్రం చెవులు చిల్లు పడిపోతాయి. ఈ విషయంలో ఎన్నో రోజులుగా వాదనలు నడుస్తూనే ఉన్నాయి. రాత్రి 10 దాటిన తరవాత కూడా ఇలా డీజేలు పెట్టి ఇబ్బంది పెట్టడమేంటని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తూ...రాష్ట్రవ్యాప్తంగా బ్యాండ్‌ బాజాను నిషేధించింది. లౌడ్‌ స్పీకర్‌లతో పాటు హైడెసిబెల్స్ ఉన్న బ్యాండ్‌పై నిషేధం విధించింది. ఇకపై ఎవరైనా సరే. పెళ్లిళ్లు సహా మరే ఫంక్షన్‌లో అయినా డీజే పెట్టాలంటే మెజిస్ట్రేట్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇక్కడ అనుమతి పొందాక..లోకల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడా పర్మిషన్ తీసుకోవాలి. ఆ తరవాత అక్కడి నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడా అనుమతి పొందాలి. ఇక్కడ పర్మిషన్‌లు అన్నీ పూర్తయ్యాక.. తిరిగి మెజిస్ట్రేట్ వద్దకు వెళ్లాలి. అక్కడ ఫైనల్‌గా అప్రూవల్ తీసుకోవాలి.  


ఇవీ సమస్యలు..


ఓ వ్యక్తి ఇంత శ్రమ పడి పర్మిషన్ తీసుకున్నాడు. "దాదాపు వారం రోజుల పాటు కాళ్లరిగేలా తిరిగితే తప్ప నాకు పరిష్మన్ లభించలేదు. కొన్నిసార్లు మెజిస్ట్రేట్ అందుబాటులో లేరు. లోకల్ పోలీసుల పర్మిషన్ కోసం చాలా శ్రమపడాల్సి వచ్చింది. ఎందుకింత ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నిస్తే ఇంత కన్నాముఖ్యమైన పనులు మాకెన్నో ఉన్నాయని సమాధానమిచ్చారు" అని చెప్పాడు ఆ యువకుడు.  మరో వ్యక్తి కూడా దీనిపై స్పందించాడు. "నా పెళ్లిలో బ్యాండ్ పెట్టాలని అనుకోవడం లేదు. మా ఫ్రెండ్స్ అంతా కలిసి గిటార్‌ మ్యూజిక్‌తో సరిపెట్టేద్దామని సలహా ఇచ్చారు. డ్యాన్స్ ప్రోగ్రామ్‌ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాం" అని చెప్పాడు. అయితే...ఈ కొత్త రూల్ కారణంగా...బ్యాండ్‌ బిజినెస్ బాగా తగ్గిపోయింది. ఇప్పటికే కొవిడ్ ప్రభావం వల్ల చాలా మంది పెళ్లిళ్లు సింపుల్‌గా చేసుకున్నారు. ఆ మేరకు బ్యాండ్ వ్యాపారం తగ్గిపోయింది. ఇప్పుడు కొత్త నిబంధనలతో ఆ కాస్త వ్యాపారం కూడా జరిగేలా లేదు. ఒక్క లఖ్‌నవూలోనే రోజుకు వెయ్యి నుంచి 15 వందల పెళ్లిళ్లవుతాయి. ప్రభుత్వం చెప్పినట్టుగా పర్మిషన్‌లు తీసుకుని బ్యాండ్ పెట్టాలనుకునే వాళ్ల సంఖ్య తగ్గిపోతే..ఆ మేరకు వీళ్లకు ఆదాయానికి కోత పడినట్టే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందే అయినా...తమ గురించి కూడా ఆలోచించాలని అంటున్నారు బ్యాండ్ నిర్వాహకులు. 


Also Read: MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ బృందాలు, సాయంత్రం దాకా విచారణ కొనసాగే అవకాశం!