Dornala to Kunta Highway: ఏపీలో మరో రోడ్డు నిర్మాణం, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇదే విషయాన్ని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. శ్రీశైలం భక్తుల సౌకర్యార్థం ప్రకాశం జిల్లా డోర్నాల నుంచి కుంట జంక్షన్ వరు ఉన్న రహదారిని రెండు లైన్ల రహహదారిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. గతి శక్తి ప్రాజెక్టులో భాగంగా 30 కిలో మీటర్ల ఈ రహదారిని రెండు లైన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అందు కోసమే కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ రూ.244.83 కోట్లతో ప్రణాళికను ఆమోదించిందని పేర్కొన్నారు. 






రెండు నెలల క్రితం రాజమండ్రిలో పర్యటన.. రహదారులకు శంకుస్థాపన


కేంద్ర రోడ్డు రవాణా రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం రాజమహేంద్రవరంలో పర్యటించారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లా్ల్లో రూ.3,000 కోట్లతో చేపట్టనున్న ఎనిమిది జాతీయ రహదారుల పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభ నుంచి వర్చువల్ విధానంలో బటన్ నొక్కి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పనుల్లో అయిదు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, మూడు రహదారుల నిర్మాణం పనులు ఉన్నాయి.


రూ.3 వేల కోట్లతో..


వాకలపూడి -ఉప్పాడ- అన్నవరం జాతీయ రహదారి 516 ఎఫ్ రూ.1,345 కోట్లతో 40.621 కిలోమీటర్ల మేర లేనింగ్ పనులు చేపట్టనున్నారు. సామర్లకోట-అచ్చంపేట నేషనల్ హైవే 516 ఎఫ్ 4 లేనింగ్ కు శంకుస్థాపన చేశారు. రూ.710 కోట్లతో 12.25 కిలోమీటర్ల పొడవునా అభివృద్ధి చేస్తారు. రంపచోడవరం నుంచి కొయ్యూరు ఎన్.హెచ్ 516E వరకు 70.12 కిలోమీటర్ల మేర రెండు లేన్ల నిర్మాణాన్ని రూ.570 కోట్లతో చేపడతారు. కైకరం ఎన్.హెచ్ -216ఏ వద్ద ఫోర్ లేన్ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని రూ.70 కోట్లతో నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు పొడవు 1.795 కిలోమీటర్లు. రాజమండ్రి నగరంలోని మోరంపూడి ఎన్.హెచ్ - 216 ఏ ఫోర్ లేన్ ఫ్లై ఓవర్ వంతెనను 1.42 కిలోమీటర్ల మేర రూ.60 కోట్లతో నిర్మిస్తారు. ఉండ్రాజవరం ఎన్.హెచ్-216 ఏ వద్ద ఫోర్ లేన్ ఫ్లై ఓవర్ వంతెనను 1.25 కిలోమీటర్ల పొడవున రూ.35 కోట్ల వయ్యంతో నిర్మించనున్నారు. తేతలి ఎన్.హెచ్-216 ఏ వద్ద ఫోర్ లేన్ వద్ద 1.03 కిలోమీటర్ల పొడవున ఫ్లై ఓవర్ వంతెనను రూ.35 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు. అలాగే జొన్నాడ ఎన్.హెచ్-216 ఏ వద్ద ఫోర్ లేన్ ఫ్లై ఓవర్ వంతెనను 0.93 కిలోమీటర్ల పొడవున రూ.25 కోట్లతో నిర్మించనున్నారు. వీటంన్నిటినీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్ విధానంలో రాజమండ్రిలో ఆవిష్కరించారు.