Arif-Sarus Friendship: వారిద్దరూ గొప్ప స్నేహితులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్తారు. ఒకరికి ఒకరు ప్రాణం ఇచ్చుకునేంత గాఢమైన స్నేహం వారిది. వారి స్నేహం ఏకంగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ను కూడా కదిలించింది. ఆయన బిజీ షెడ్యూల్ ను కూడా వదిలేసి వారిద్దరినీ కలవడానికి వాళ్ల ఊరొచ్చారు. వారిద్దరి స్నేహాన్ని చూసి మైమరిచిపోయారు. మాజీ సీఎంను కూడా కదిలించిన ఆ స్నేహం ఏంటా అని ఆలోచిస్తున్నారా.. ఎవరబ్బా ఆ తోపు మిత్రులు అని బుర్ర గోక్కుంటున్నారా.. అయితే వారి స్నేహం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఉత్తరప్రదేశ్ అమేఠి జిల్లా మండ్కా గ్రామానికి చెందిన మహమ్మద్ ఆరిఫ్ కు ఓ కొంగకు మధ్య స్నేహం అది. ఏడాది క్రితం కొంగకు గాయం అయింది. హార్వెస్టర్ నడిపే ఆరిఫ్.. తన పని చేస్తున్నప్పుడు పొలంలో కాలు విరిగి కదల్లేని స్థితిలో ఉన్న కొంగను గుర్తించాడు. నొప్పితో తీవ్రంగా బాధపడుతున్న ఆ కొంగను జాగ్రత్తగా దగ్గరకు తీసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. విరిగిన కాలుకు చికిత్స చేశాడు. కొంత కాలం తర్వాత ఆ కొంగకు నయమైపోయింది. ఆ తర్వాత దాని కాళ్లపై అది నిలబడిగలిగింది. ఫిబ్రవరిలో ఆ కొంగ ఆరిఫ్ కు కనిపించగా... చికిత్స చేసి ఏప్రిల్ నాటికి అది కోలుకుంది. నయమైపోయిన తర్వాత ఆ కొంగ తన దగ్గరి నుండి ఎగిరిపోతుందని ఆరిఫ్ భావించాడు. కానీ ఆ కొంగ మాత్రం ఎక్కడికీ వెళ్లలేదు. 


ఆ కొంగను స్టోర్క్ అని పిలుస్తారు. దాదాపు అది 5 అడుగుల ఎత్తు ఉంటుంది. రెక్కలు విప్పినప్పుడు ఏకంగా 8 అడుగుల వెడల్పు ఉంటుంది. ఆ కొంగ ఆరిఫ్ ను వదిలేసి ఎక్కడికీ వెళ్లలేదు. దీంతో దానికి ఆరిఫ్ బచ్చా అని పేరు పెట్టాడు. ఆ కొంగ ఆరిఫ్ తోనే ఉండటం మొదలు పెట్టింది. తనతో పాటే అన్ని తింటుంది. పక్కనే ఉంటుంది. నిద్రిస్తుంది. ఆరిఫ్ ఎక్కడికి వెళ్లినా అతడితో పాటు ఆ కొంగ కూడా వెళ్తుంది. ఆరిఫ్ బైక్ పై వెళ్తుంటే అతడితో పాటు వెనకే ఎగురుతూ వస్తుంది. ఈ కొంగ కేవలం ఆరిఫ్ తోనే స్నేహంగా ఉంటుంది. ఇంట్లో ఎవరైనా దాని దగ్గరకు వెళ్తే దాడి చేస్తుంది. ఆరిఫ్ భార్యగానీ, కుమారుడు గానీ ఆహారం అందించేందుకు వెళ్లినా అది ఏమాత్రం ఊర్కోదు. ముక్కుతో పొడవడానికి వస్తుంది. దాంతో ఎవరూ దాని దగ్గరకు వెళ్లడం మానేశారు. 


మనిషికి, కొంగకు మధ్య కుదిరిన ఈ స్నేహం గురించి గ్రామస్థులకు, చుట్టుపక్క ఊర్ల వారికి తెలిసింది. అది కాస్త జిల్లా స్థాయిలో ఆ తర్వాత దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వార్తాపత్రికల్లో, న్యూస్ ఛానళ్లలో వారిద్దరి స్నేహం గురించి తెలిసింది. ఈ ఆసక్తికర విషయం గురించి తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్వయంగా వారిద్దరి వద్దకూ వెళ్లాడు. ఆదివార మండకా గ్రామానికి వెళ్లి ఆరిఫ్ ఖాన్ ను కలిశారు. కొంగతో ఎలా స్నేహం కుదిరిందో అడిగి తెలుసుకున్నారు.