Revanth Reddy Padayatra : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రకు అదనపు భద్రత కల్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.  తన పాదయాత్ర సందర్భంగా అదనపు సెక్యూరిటీ కల్పించాలని కోర్టును ఆశ్రయించారు రేవంత్ రెడ్డి. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు యాత్రకు అదనపు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ సందర్భంగా పాదయాత్రలో రేవంత్ రెడ్డి చుట్టూ 69 మంది భద్రత సిబ్బందిని ఏర్పాటు చేశామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆ భద్రత కేవలం యాత్ర, బందోబస్తు, ట్రాఫిక్ కోసమే ఇస్తున్నారని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నైట్ హాల్ట్ లోనూ సెక్యూరిటీ కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పాదయాత్రకు పూర్తి భద్రక కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. 


గత విచారణలో 


టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో గతంలో విచారణ జరిగింది. తాను చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రకు భద్రత పెంచాలని రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  రేవంత్ యాత్ర జరిగే ప్రాంతాల్లో  ఇప్పటికే భద్రత కల్పిస్తున్నట్టు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపింది. పాదయాత్ర సందర్భంగా భద్రత కల్పించాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశించినట్టు ప్రభుత్వ న్యాయవాది(జీపీ) తెలిపారు. భద్రత కల్పించాలని ఆదేశించిన ఫ్యాక్స్ కాపీని కోర్టుకు సమర్పించారు.  డీజీపీ ఆదేశాలకు అనుగుణంగా భద్రత ఇస్తున్నారో లేదో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది.  అయితే వాదనలు విన్న న్యాయస్థానం పాదయాత్రకు భద్రత కల్పిస్తే విచారణ కొనసాగించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. ప్రభుత్వం చెబుతున్న భద్రత ఉందో? లేదో? సోమవారం కోర్టుకు తెలపాలని రేవంత్‌ తరఫు న్యాయవాదికి సూచించింది.  ఈ పిటిషన్ పై సోమవారం విచారించిన కోర్టు అదనపు భద్రక కల్పించాలని ఆదేశించింది. 


భారత్ జోడో యాత్రకు అనుబంధంగా 



కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అనుబంధంగా టీపీసీసీ హాత్ సే హాత్ జోడో యాత్రను చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న ప్రారంభించారు. రాహుల్ గాంధీ పాదయాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన వనదేవతలు సమ్మక్క, సారలమ్మల స్ఫూర్తితో ఈ యాత్ర చేపట్టామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో రెండు నెలల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ప్రతి ఇంటిపై కాంగ్రెస్ స్టిక్కర్లు అతికించడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలను ప్రజలకు పంచుతున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్  నేతలు తమదైన శైలిలో తమ నియోజకవర్గాల్లో జోడో యాత్రను నిర్వహిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ స్థానిక సమస్యలు ప్రస్తావిస్తూ రేవంత్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. . సీఎల్పీ నేత భట్టి విక్ర మార్క, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌ రెడ్డితోపాటు  పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అదిలాబాద్ జిల్లాలోని బాసర నుంచి హైదరాబాద్ వరకు మొదటి విడతగా దాదాపు 10 రోజుల పాటు ప్రజా సమస్యలపై పోరు యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించారు.