Revant Vs Sharmila :  వైఎస్ఆర్ బ్రాండ్ ఎవరిది ?.  తెలంగాణలో ఇప్పుడు ఈ అంశంపై అటు షర్మిల, ఇటు రేవంత్ రెడ్డి మధ్య రాజకీయ  రచ్చ ప్రారంభమయింది. దీనికి కారణం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన తెస్తానంటూ షర్మిల పార్టీ పెట్టుకుని పాదయాత్ర చేస్తూంటే..రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అని.. ఆయన కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని ప్రకటిస్తున్నారు. వైఎస్ఆర్ అభిమానులు ఎవరూ కాంగ్రెస్ దాటి పోకుండా ఉండేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం తరచూ వైఎస్ఆర్ ను పొగుడుతున్నారు. ఆయన పథకాలు కాంగ్రెస్ వల్లేనని  చెబుతున్నారు. దీంతో తాను ఎవరైతే మద్దతుగా ఉంటారని రాజకీయాల్లోకి వచ్చానో వారందర్నీ రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం దూరం చేసే ప్రయత్నం చేస్తన్నారన్న అనుమానంతో  షర్మిల రంగంలోకి దిగారు. 


వైఎస్‌పై గతంలో రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని షర్మిల విమర్శలు                        


చంద్రబాబు విసిరిన ఎంగిలి మెతుకుల కోసం ఆనాడు  YSRను ఆజన్మ శత్రువు అన్నది ఈ దొంగ కాదా? మహానేత మరణిస్తే పావురాలగుట్టలో పావురం అంటూ హేళన చేసింది ఈ దగా కోరు కాదా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఓటుకు నోటు దొంగను జనాలు నమ్మడం లేదని, మహానేత పేరును వాడకుంటున్న రేవంత్ కు YSR అభిమానులే బుద్ధి చెప్తారని షర్మిల హెచ్చరించారు. పాదయాత్ర చేసి ప్రభుత్వంపై పోరాటం చేసింది వైఎస్ఆర్ బిడ్డ మాత్రమేనని షర్మిల చెబుతున్నారు.


వైఎస్ కాంగ్రెస్ పార్టీ సొంతమని అంటున్న  రేవంత్ రెడ్డి                                              


వైఎస్ఆర్ లెగసీ తనది మాత్రమేనని షర్మిల గట్టిగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతమని రేవంత్ రెడ్డి తరచూ చెబుతున్నారు. ఆయనపై ప్రజల్లో అభిమానాన్ని షర్మిల వైపు పోకుండా.. గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తన జీవితం అంతా కాంగ్రెస్ కోసమే బతికారని..కాంగ్రెస్ తరపునే పథకాలు ప్రవేశ పెట్టారని.. కాంగ్రెస్ నేతగానే మరణించారని గుర్తుచేస్తున్నారు.   


ఇంతకీ వైెఎస్ఆర్ అభిమానులు ఏ పార్టీ వైపు ఉంటారు ?            


అయితే అసలు షర్మిల పార్టీ పెట్టింది.. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికేనని రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు. వైఎస్ అభిమానులు.. రెడ్డి సామాజికవర్గం ఓట్లలో కొన్ని అయినా చీల్చితే.. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని.. అందుకే రేవంత్ రెడ్డి ... షర్మిల పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగకుండా... జాగ్రత్తలు తీసుకుంటున్నారని సందర్భం వచ్చినప్పుడల్లా వైఎస్ఆర్‌ను పొగుడుతున్నారని అంటున్నారు. రేవంత్ వ్యూహం వల్ల తన పార్టీకి మద్దతు ఇస్తారనుకుంటున్న వారు కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా నిలిస్తే.. తనకు నష్టం జరుగుతుందని.. వైఎస్ అభిమానులంతా తన వెంటే ఉండాలన్నట్లుగా షర్మిల పిలుపునిస్తున్నారు.